ఇంటర్ సిటీ రైలు.. ఇక నుంచి నెక్కొండలో ఆగుతుంది

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్టాప్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. నెక్కొండలో గుంటూరు, -సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12705/12706) రైలును ఆపాలంటూ కిషన్ రెడ్డికి నెక్కొండ ప్రజలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. నెక్కొండ నుంచి గుంటూరు, హైదరాబాద్ వచ్చే జనం ఎక్కువగా ఉంటున్నారని.. రైలుకు హాల్ట్ లేకపోవటం ఎంతో సమయం వృధా అవుతుందని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

నెక్కొండ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను కేంద్ర రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేవలం సమాచారం ఇవ్వటమే కాకుండా.. నెక్కొండలో ఇంటర్ సిటీ రైలుకు హాల్ట్ వచ్చే విధంగా కృషి చేశారు. ఇక నుంచి నెక్కొండలో ఒక నిమిషంపాటు రైలు ఆగుతుందని.. ఈ సదుపాయాన్ని నెక్కొండ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కృతజ్ణతలు తెలియజేశారు నెక్కొండ ప్రజలు.