ఎన్టీపీసీ తెలంగాణ ఫేజ్​ 2కు గ్రీన్​ సిగ్నల్

ఎన్టీపీసీ తెలంగాణ ఫేజ్​ 2కు గ్రీన్​ సిగ్నల్
  • రూ.29,344.85 కోట్ల అంచనాతో 2,400 మెగావాట్ల ప్లాంట్​ నిర్మాణం
  • ఎన్టీపీసీ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం
  • ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేస్తున్న  ఎన్టీపీసీ ఆఫీసర్లు

గోదావరిఖని, వెలుగు : ఎన్టీపీసీలో తెలంగాణ ఫేజ్–2 ప్లాంట్​ ఏర్పాటుకు ఎన్టీపీసీ కంపెనీ డైరెక్టర్ల బోర్డు మీటింగ్​లో గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టం–14లో పేర్కొన్న విధంగా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ నెలకొల్పే క్రమంలో ఇప్పటికే ఫేజ్–1లో భాగంగా 1,600 మెగావాట్ల (800 మెగావాట్ల రెండు యూనిట్లు) విద్యుత్​ ప్లాంట్​ను నెలకొల్పారు. తాజాగా మిగిలిన 2,400 మెగావాట్ల (800 మెగావాట్ల మూడు యూనిట్లు) ఫేజ్–2 ప్లాంట్​కుఢిల్లీలో జరిగిన ఎన్టీపీసీ కంపెనీ డైరెక్టర్ల బోర్డు మీటింగ్​లో ఆమోదం తెలిపారు.  రూ.29,344.85 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్–2 ప్లాంట్​ను నిర్మించనున్నారు.

ఇప్పటికే 4,200 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి..

రామగుండం ప్రాంతంలో నేషనల్​ థర్మల్​ పవర్​ కార్పొరేషన్​(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో 1975లో 200 మెగావాట్ల మొదటి యూనిట్​తో మొదలైన విద్యుత్​ ప్లాంట్,​ అంచలంచెలుగా ఏడు దశల్లో 2,600 మెగావాట్ల వరకు చేరుకుంది. అలాగే తెలంగాణ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా మొదట 1,600 మెగావాట్ల (800 మెగావాట్ల రెండు  యూనిట్లు) ప్లాంట్​ను నెలకొల్పారు. దీంతో ఇప్పటికే రామగుండం, తెలంగాణలోని మిగిలిన ప్రాజెక్టులు కలిపి 4,200 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా మరో 2,400 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ నిర్మాణం అయితే 6,600 మెగావాట్లతో దేశంలోనే అత్యధికంగా విద్యుత్​ను ఉత్పత్తి చేసే ప్రాంతంగా రామగుండం నిలవనుంది.

1,190 ఎకరాల భూమి అవసరం..

ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్​ ఫేజ్–2 నిర్మాణం కోసం ఇప్పటికే మట్టి నమూనా పరీక్షలను మేనేజ్​మెంట్​ నిర్వహించింది. చిమ్నితో పాటు ఇతర నిర్మాణాలకు అనుకూలమైన స్థలాలను బోర్​వెల్​ తవ్వకాల ద్వారా గుర్తించారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్​ షిప్​లోని పలు క్వార్టర్లను ఫేజ్–2 ప్లాంట్​ నిర్మాణం కోసం తొలగించనున్నారు. ఈ ప్లాంట్​ నిర్మాణం కోసం 1,190 ఎకరాల భూమి అవసరమవుతుందని మేనేజ్​మెంట్​ ప్రతిపాదించింది. అయితే ఈ స్థలం ఎన్టీపీసీ సంస్థ ఆధీనంలోనే ఉండడంతో పెద్దగా ఇబ్బందులు ఉండే అవకాశం లేదు.  

యాష్​ పాండ్​ స్థలంపై వివాదం..

ఎన్టీపీసీ తెలంగాణ ఫేజ్–2లో నిర్మాణం చేసే 2,400 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ కోసం అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామ పరిధిలోని మొగల్​పహాడ్​ ప్రాంతంలోని 606 ఎకరాల ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అయితే 23/2, 24, 53, 54, 55, 56, 57, 58, 59 సర్వే నెంబర్లలోని ఈ భూమి ధరణి రికార్డుల్లో చాలా రోజుల కింద చనిపోయిన రాజా వెంకట మురళీ మనోహర్​రావు పేరుపై ఉంది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం డిజిటలైజేషన్​ కాలేదు. కానీ, చాలా మంది రైతులు ఈ భూముల్లో ఎన్నో ఏండ్లుగా వ్యయసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. రైతులు ఈ భూములకు సంబంధించిన నష్టపరిహారం తమకు చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ భూములు తమకు సంబంధించినవని శ్రీ లలిత సేవా సమితి ట్రస్ట్​ వైస్​ చైర్మన్​ గుర్రం నారాయణ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు గోదావరిఖని జూనియర్​ సివిల్​ కోర్టులో పెండింగ్​లో ఉంది. ఈ నేపథ్యంలో యాష్​పాండ్​ స్థలం వ్యవహారం ఎప్పటికి కొలిక్కి వస్తుందోనని అంటున్నారు.

ఈ నెల 29న ప్రజాభిప్రాయ సేకరణ.. 

ఎన్టీపీసీ తెలంగాణ ఫేజ్–2లో భాగంగా నిర్మించే 2,400 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ కోసం ఈ నెల 29న ఎన్టీపీసీ జ్యోతినగర్​లోని జడ్పీ హైస్కూల్​ ఆవరణలో ఉదయం 11 గంటల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. కలెక్టర్  అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. రామగుండం, కుందనపల్లి, రాణాపూర్, ఇతర గ్రామాలకు చెందిన ప్రజల నుంచి కొత్త ప్లాంట్​ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు.