- నిజాంసాగర్ ద్వారా లక్షా 24,825 ఎకరాలకు సాగునీరు
- ఏడు విడతల్లో 10 టీఎంసీల వాటర్ విడుదల
- పోచారం నుంచి బీ జోన్ఆయకట్టు 3,806 ఎకరాలకు కూడా..
కామారెడ్డి, వెలుగు: యాసంగి సీజన్లో జిల్లా ప్రాజెక్టుల కింద సాగుచేసే పంటలకు నీళ్లి ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.వర్షాకాలంలో భారీగా వానలు కురవడంతో ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. మూడు రోజుల కింద హైదరాబాద్లో సమావేశమైన ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్(శివమ్) కమిటీ నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్, నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు ఇరిగేషన్ఆఫీసర్లు రెడీ అయ్యారు.
ఇప్పటికే రైతులు ప్రాజెక్టుల కింద వరిసాగుకు నారు పోశారు. నాట్లు వేయడానికి రెడీ అవుతున్నారు. బోర్లు అందుబాటులో ఉన్న రైతులు నాట్లు కూడా వేస్తున్నారు. ఈ యాసంగి సీజన్లో జిల్లాలో 4,13,248 ఎకరాల్లో వివిధ పంటలు సాగవనున్నట్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. ఇందులో 2,60,871 ఎకరాల్లో వరి సాగు ఉండగా, ప్రాజెక్టులు, చెరువుల కింద 80 వేల ఎకరాల వరకు సాగుకానుంది.
పోచారం ప్రాజెక్ట్ కింద..
నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్ పూర్తి ఆయకట్టు 10,500 ఎకరాలు. జిల్లాలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో ప్రాజెక్ట్ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో బీ జోన్ పరిధిలోని 3,806 ఎకరాలకు నీరందించనున్నారు. ఇందుకోసం 1.368 టీఎంసీల నీళ్లను విడతల వారీగా విడుదల చేస్తారు. గురువారం ఎల్లారెడ్డిలో నీటి విడుదలపై ఇరిగేషన్డీఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, రైతులతో మీటింగ్ నిర్వహించారు.
మైనర్ ప్రాజెక్టులు కౌలాస్నాలా, కల్యాణితో పాటు, చెరువులు, కుంటల కింద ఆయకట్టుకు కూడా నీటిని రిలీజ్చేసే అవకాశముంది. జిల్లాలోని పలు ఏరియాల్లోని చెరువుల్లో నీళ్లు నిల్వ ఉన్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చెరువుల నుంచి నీటిని విడుదల చేసే వీలుంది. బాన్సువాడ, ఎల్లారెడ్డి ఏరియాల్లో నాట్లు వేయడానికి రైతులు రెడీ అవుతుండగా, కామారెడ్డి ఏరియాలో మాత్రం ఇప్పుడిప్పుడే నార్లు పోస్తున్నారు.
రెండు జిల్లాలకు నిజాంసాగర్ నీళ్లు
నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 17.08 టీఎంసీలకు ప్రస్తుతం 16.164 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. యాసంగిలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు కలిపి ప్రాజెక్ట్ ఆయకట్టు లక్షా 24,825 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఉన్నతాధికారులు నిర్ణయించారు. 7 విడతల్లో 10 టీఎంసీల నీళ్లు రిలీజ్ చేస్తారు. మొత్తం 49 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా పంటకు నీళ్లందిస్తారు. కామారెడ్డి జిల్లాలో 22 డిస్ట్రిబ్యూటరీలు, నిజామాబాద్లో 27 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. నిజాంసాగర్ ఆయకట్టు కింద వరిసాగుకు ఇప్పటికే రైతులు రెడీ అయ్యారు. నారు మళ్లు పోశారు. నారుమళ్ల కోసం గతంలోనే వెయ్యి క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. గురువారం ప్రాజెక్టు నుంచి 1700 క్యూసెక్కుల నీటిని వదిలారు.