ఎన్నికలకు 8 నెలల ముందే టికెట్​పై కౌశిక్​కు గ్రీన్ సిగ్నల్

  • నెల క్రితమే గెల్లుకు నామినేటెడ్ పోస్టు హామీ 
  • ఈటలకు గట్టి పోటీదారుగా భావించే ‘పాడి’కి టికెట్
  • బహిరంగ సభలో హుజూరాబాద్ కు రూ.50 కోట్ల 
  • నిధులు ప్రకటించిన మంత్రి కేటీఆర్

జమ్మికుంట, వెలుగు: హుజూరాబాద్ బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి కన్ఫమ్ అయిపోయింది. ఏడాదిగా ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొన్నగందరగోళానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెరదించారు. జమ్మికుంటలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభ వేదికగా వారు ఇక నుంచి ఎవరితో నడవాలో క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు దీటైన అభ్యర్థిగా భావిస్తున్న కౌశిక్ నే ఖరారు చేశారు. ఈటలను ఓడించేందుకు వచ్చే ఎనిమిది నెలలు ప్రజల్లోనే ఉండి ఊళ్లల్లోనే తిరుగు.. అక్కడే పడుకో అని కౌశిక్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సూచించిన విషయం తెలిసిందే. చాలామంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలే తమకు నెక్స్ట్ టికెట్ వస్తుందో రాదోనన్న టెన్షన్ లో ఉంటే.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే టికెట్ ను ఎనిమిది నెలల ముందే కన్ఫం చేయించుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. 

హుజూరాబాద్ పై కేటీఆర్ ప్రత్యేక దృష్టి..

2021 అక్టోబర్ లో హుజూరాబాద్ బై ఎలక్షన్ ప్రచారం హోరాహోరీగా సాగినప్పటికీ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ వైపు రాలేదు. అయితే వచ్చే జనరల్ ఎన్నికల్లో హుజూరాబాద్ బాధ్యతలు కేటీఆర్ పూర్తి స్థాయిలో తీసుకునేటట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రావడం, బహిరంగ సభలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని పరోక్షంగా ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బహిరంగ సభలో అడగగానే జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కాలేజీ గ్రౌండ్, హుజూరాబాద్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లను స్టేడియాలుగా మార్చేందుకు రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు ఇస్తామని చెప్పారు. 

ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకే ముందస్తు ప్రకటన..

హుజూరాబాద్ బై ఎలక్షన్ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ తిరుగుతున్నారు. దీంతో బీఆర్ఎస్ లోనే ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఎదుర్కోవడం కష్టమని భావించిన పార్టీ అధిష్టానం.. ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు, ఆధిపత్య పోరుకు చెక్ పెట్టి, క్యాడర్ ను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రూపులకు తావివ్వకుండా అంతా పాడి నాయకత్వంలో పని చేయాలని గెల్లుతో సహా పార్టీ సీనియర్లందరికీ సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నెల రోజుల క్రితమే పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. గెల్లుకు ప్రాధాన్యం తగ్గలేదని చెప్పేందుకే హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు వచ్చేటప్పుడు హెలీకాప్టర్ లో మంత్రి కేటీఆర్ తన వెంట తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.