కాంగ్రెస్ హయాంలో కట్టారని..గ్రీన్ ఫీల్డ్ స్టేడియాన్ని పక్కన పెట్టిన్రు

కాంగ్రెస్  హయాంలో కట్టారని..గ్రీన్ ఫీల్డ్  స్టేడియాన్ని పక్కన పెట్టిన్రు
  • బిల్లుల చెల్లింపు నుంచి ఓపెనింగ్  వరకు వివక్షే
  • కోట్లు పెట్టి స్టేడియం కట్టినా ఆటలు ఆడనిస్తలేరు

గద్వాల, వెలుగు: గతంలో కాంగ్రెస్  పీరియడ్ లో చేపట్టిన పనులపై బీఆర్ఎస్  ప్రభుత్వం వివక్ష చూపింది. దీంతో రూ. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన గ్రీన్ ఫీల్డ్  స్టేడియం నిరుపయోగంగా ఉంది. 2014లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో గ్రీన్ ఫీల్డ్  స్టేడియం నిర్మించారు. 2018లో పనులు కంప్లీట్ అయినప్పటికీ ఇప్పటివరకు ఆటలు ఆడనివ్వడంలేదు. దీంతో స్టేడియం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గేటు ధ్వంసం చేసి విలువైన సామగ్రి ఎత్తుకెళ్తున్నారు. అయినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఓపెనింగ్  చేయడం ఇష్టం లేక..

గ్రీన్ ఫీల్డ్  స్టేడియం 2018లో కంప్లీట్ అయింది. అప్పట్లో ప్రారంభించాల్సి ఉండగా, స్టేడియం ఓపెన్​ చేస్తే ఎక్కడ కాంగ్రెస్  ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోననే ఉద్దేశంతో అక్కడ ఆటలకు పర్మిషన్​ ఇవ్వలేదు. మినీ గురుకుల స్కూల్​ను అక్కడ ప్రారంభించారు. ఏడాది పాటు అక్కడ స్కూల్ నడిచాక ఆరు నెలల కింద ఆ స్కూల్ ను జిల్లా కేంద్రానికి షిఫ్ట్  చేశారు. దీంతో అది వృథాగా మారింది. స్టేడియం నిర్మాణం నుంచి ఓపెనింగ్  వరకు నిర్లక్ష్యం చేశారు. పనులు కంప్లీట్  చేసి జిల్లా స్పోర్ట్స్  అథారిటీకి అప్పగించినా ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు జరపడం లేదు. స్టేడియం నిరుపయోగంగా మారడంతో చుట్టుపక్కల గ్రామాల వారు దీన్ని మద్యం అడ్డాగా మార్చేశారు.

అన్ని సౌలతులు ఉన్నా..

గ్రౌండ్ తో పాటు క్రీడాకారులకు రూమ్స్  ఉన్నాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్  కోర్టులతో పాటు ఇండోర్ స్టేడియంలో షటిల్  కోర్టు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది స్కూల్​ను షిఫ్ట్​ చేయడంతో ఆకతాయిలు గ్రౌండ్ లోకి వెళ్లి డోర్లు, అద్దాలను ధ్వంసం చేస్తున్నారు. వాటర్  ట్యాంకులను పగలగొట్టేశారు. స్టేడియం ఉపయోగంలోకి వస్తే అలంపూర్  నియోజకవర్గ క్రీడాకారులతో పాటు ఎర్రవల్లి మండల కేంద్రం,షేక్ పల్లి, బీచుపల్లి, బుక్కాపురం, కొండపేట, జింకలపల్లి, ధర్మవరం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

వినియోగంలోకి తెస్తాం..

గ్రీన్ ఫీల్డ్  స్టేడియం వృథాగా ఉన్న విషయం వాస్తవమే. ఈ విషయాన్ని కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే స్టేడియాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం. 

బీఎఎస్  ఆనంద్, డిస్ట్రిక్ట్​ స్పోర్ట్స్  ఆఫీసర్