గ్రీవెన్స్​ సెల్ కంప్లయింట్స్​ను లైట్ ​తీస్కుంటున్న జీహెచ్ఎంసీ ఆఫీసర్లు

గ్రీవెన్స్​ సెల్ కంప్లయింట్స్​ను లైట్ ​తీస్కుంటున్న జీహెచ్ఎంసీ ఆఫీసర్లు
  • సాల్వ్​ చేయకుండా క్లోజ్ 
  • రీ ఓపెన్ ఆప్షన్​ ఎత్తేయడంతో ఆడింది ఆట పాడింది పాట
  • ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలంటున్న జనాలు
  • యేటా జీహెచ్ఎంసీ గ్రీవెన్స్ కు 3 లక్షల ఫిర్యాదులు
  • 30 శాతం పరిష్కరించినట్టు ఫేక్ ​అప్​డేషన్​

 కాప్రా సర్కిల్​లోని చర్లపల్లి డివిజన్ విద్యా మారుతి నగర్​లో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని రాంరెడ్డి అనే వ్యక్తి ఈ నెల 7న జీహెచ్ఎంసీ గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదు చేశాడు. అయితే, రిపేర్లు చేయకుండానే సమస్యను పరిష్కరించామంటూ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేశారు. ఇదే సమస్యపై ఆయన ఈ నెల14న మళ్లీ ఫిర్యాదు చేశాడు. మళ్లీ సమస్య పరిష్కారించకుండానే రిసాల్వ్​కొట్టడంతో కంప్లయింట్ చేయడం దండగ అనుకుని వదిలేశాడు.

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా గ్రీవెన్స్ సెల్ కు వస్తున్న ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రాబ్లమ్​ను సాల్వ్​చేయకుండానే చేసినట్టు ఆన్​లైన్​లో స్టేటస్​అప్​డేట్​చేస్తున్నారు. దీంతో ఫిర్యాదుదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. మై జీహెచ్ఎంసీ యాప్ తో పాటు హెల్ప్ లైన్ నెంబర్, వెబ్ సైట్, డయల్100 ద్వారా సిటీ ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తుంటారు. 

కంప్లయింట్​చేసిన వెంటనే ఫిర్యాదుదారులకు ఆటోమెటిక్ గా ఐడీ క్రియేట్​అవుతుంది. ఈ ఐడీ ఆధారంగా సమస్యకి పరిష్కారం లభించిందా? వర్క్ ప్రాసెస్ ఏ స్టేజ్ లో ఉంది అనేది ఫిర్యాదుదారుడు తెలుసుకోవచ్చు. కానీ, బల్దియా అధికారులు మాత్రం కంప్లయింట్​వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే పని పూర్తయ్యిందని, కంప్లయింట్​క్లోజ్​చేస్తున్నామని రిసాల్వ్​కొడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అలాగే ఉంటోంది. కొంతమంది బల్దియా అధికారుల తీరును ఎక్స్​వేదికగా జనం ప్రశ్నిస్తున్నారు. 

వార్డు ఆఫీసులు

గ్రేటర్ లో వార్డు ఆఫీసులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వేలల్లో ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి. కొందరు అధికారులు వార్డు ఆఫీసుల్లో ఉండకుండా సర్కిల్ ఆఫీసులకే పరిమితమవుతున్నారు. గతేడాది జులై 16న 50 వేల జనాభాకు ఒక వార్డు ఆఫీసును ఏర్పాటు చేశారు. ఇందులో 10 శాఖలకు చెందిన 10 మంది ఉద్యోగులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలి. కానీ, ఇక్కడ ఆఫీసర్లు ఎవరూ ఉండకపోవడంతో జనాలెవరూ కంప్లయింట్స్ ఇవ్వడానికి రావడం లేదు. అసలు చాలామందికి వార్డు ఆఫీసులు ఉంటాయని, అందులో సమస్యలపై కంప్లయింట్​ఇస్తే పరిష్కరిస్తారన్న సంగతి కూడా తెలియడం లేదు. దీంతో ఆన్ లైన్ లో ఫిర్యాదు చేస్తే వారు కూడా కొన్ని కంప్లయింట్స్​వార్డు స్థాయి అధికారులకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఇక్కడ పరిష్కారం చూపకుండానే రిసాల్వ్​కొట్టి క్లోజ్ చేస్తున్నారు.  

సిటిజన్ చార్టర్ ప్రకారం.. 

బల్దియాకు వస్తున్న ఫిర్యాదులను సిటిజన్ చార్టర్ ప్రకారం పూర్తి చేయాలి. ఇందులో చెత్తని తరలిండానికి సంబంధించిన ఫిర్యాదులను అదే రోజు పరిష్కరించాలి. పాట్ హోల్స్​పూడ్చడం, మ్యాన్ హోల్స్ మూతల ఏర్పాటు, రోడ్డు పక్కన ఉన్న సిల్ట్ తీయడం, స్ట్రీట్ లైట్ల రిపేర్లు, యాంటీ లార్వా ఆపరేషన్స్, జంతువులు మరణించాయని వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించాలి. 

డ్రైనేజీలు బ్లాక్, సీ అండ్ డీ(భవన నిర్మాణ వ్యర్థాలు) క్లీనింగ్ కోసం అయితే 48 గంటలు, ఫాగింగ్ ఆపరేషన్స్​24 గంటల నుంచి 48 గంటల్లో చేయాలి. ఫుట్ పాత్ రిపేర్లు 72గంటల్లో చేయాలి. పబ్లిక్ టాయిలెట్స్​క్లీనింగ్ అదే రోజు, మెయింటనెన్స్​నెలరోజుల్లో చేయాలి. కానీ, ఏ ఒక్కటి సకాలంలో చేయకపోగా, పరిష్కరించినట్టు ఫాల్స్​సమాచారం ఇస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. 

నెలలో 10 వేల ఫిర్యాదులు పెండింగ్

బల్దియాకు ప్రతినెలా 25 వేల కంప్లయింట్స్ వస్తుండగా, ఎప్పుడూ 10 వేల ఫిర్యాదులు పెండింగ్​లో ఉంటున్నాయి. వేల సంఖ్యలో పెండింగ్​లో ఉంటుండడంతో అధికారులు పనులు చేయకుండానే చేసినట్టు రిసాల్వ్​కొడుతున్నారు. ఎక్కువగా పార్కులు, రోడ్ల డ్యామేజ్, ఎలక్ట్రికల్, చెత్తకి సంబంధించిన సమస్యలు ఇలా క్లోజ్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో 3 లక్షల వరకు ఫిర్యాదులు రాగా, 20 నుంచి 30 శాతం వరకు పరిష్కారం చూపకుండానే క్లోజ్​చేశారు. గతంలో సమస్య పరిష్కారం కాకుండా ఫిర్యాదును క్లోజ్ చేస్తే అదే కంప్లయింట్ ను రీ ఓపెన్ చేసేందుకు వీలుండేది. 

రీ ఓపెన్ అయిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఎందుకిలా జరుగుతోందని తెలుసుకునే వీలుండేది. ఆ ఆప్షన్ తీసెయ్యడంతో కింది స్థాయి అధికారులు ఆడింది ఆట పాడింది పాటలా మారింది. పనులు చేయకుండానే చేసినట్లు ఆన్​లైన్​లో అప్​డేట్​చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు.