ఖమ్మం, వెలుగు : గ్రెనడా హై కమిషనర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ ఆదివారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన ఆయన హైదరాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ చదివి 45ఏళ్ల కిందట గ్రెనడా వెళ్లి వ్యాపారాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. వ్యాపార, సేవా రంగాలలో గీతా కిషోర్ కృషిని కొనియాడుతూ ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లెస్ మెంబర్ ఆఫ్ బ్రిటీష్ ఎంప్తెర్ (ఎంబీఈ) బిరుదుతో గౌరవించారు.
గ్రెనడాకు 1974లో స్వాతంత్ర్యం సిద్ధించినా, ఇంకా కూడా ఇంగ్లాండ్ మోనార్కీ కిందనే కొనసాగుతున్నది. ఆయన పుట్టి పెరిగిన ఇండియాకి గ్రెనడా దేశం తరపున దౌత్యవేత్తగా పంపడం విశేషం. గీతా కిషోర్ తన తెలంగాణ పర్యటన సందర్భంగా ఎంపీ రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకమిషనర్ పసుపులేటిని ఎంపీ వద్దిరాజు సత్కరించారు.