
చండీగఢ్: పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మనోరంజన్ కాలియా ఇంటి వద్ద మంగళవారం తెల్లవారుజామున గ్రనేడ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇంటి అల్యూమినియం పార్టిషన్, వంటగది కిటికీలు, ఒక బాత్రూమ్ తలుపు, ఎస్‌యూవీ వెహికల్, బైక్ డ్యామేజ్ అయ్యాయి. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. గ్రనేడ్ పేలుడు సమయంలో మనోరంజన్ కాలియా ఇంట్లోనే నిద్రిస్తున్నారు.
దీనిపై మనోరంజన్ కాలియా మాట్లాడుతూ.."రాత్రి 1 గంటల సమయంలో పేలుడు జరిగింది. నేను నిద్రలో ఉన్నాను. ఓవర్ లోడింగ్ కారణంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఉండవచ్చని మొదట అనుకున్నాను. తర్వాత ఇది గ్రనేడ్ పేలుడని తెలిసి, నా గన్‌మన్‌ను పోలీస్ స్టేషన్‌కు పంపాను" అని తెలిపారు. ఒక వ్యక్తి ఆటోలో వచ్చి మనోరంజన్ ఇంటి గేటు వద్ద గ్రనేడ్ విసిరి పారిపోయినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. దీని ఆధారంగా పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఆటోను సీజ్ చేశారు.
ఐఎస్ఐ ప్రమేయం ఉండవచ్చు
గ్రనేడ్ దాడి వెనుక పాకిస్తాన్ ఇంటర్- సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రమేయం ఉండవచ్చని పంజాబ్ పోలీస్ స్పెషల్ డీజీపీ అర్పిత్ శుక్లా అనుమానం వ్యక్తం చేశారు. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడైన జీషాన్ అక్తర్, పాకిస్తానీ గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టీల పాత్రను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.
కాగా.. మనోరంజన్ పై జరిగిన దాడిని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. సీఎం భగవంత్ మాన్, డీజీపీ గౌరవ్ యాదవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా కాలియా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు జలంధర్ చేరుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కేంద్ర ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగాయి.