
వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న టీనేజ్ కెరటం గ్రెటా థన్‌బర్గ్‌కు ఆల్టర్నేట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. బుధవారం ‘రైట్ లైవ్లీ హుడ్ అవార్డ్’ (దాన్నే ఆల్టర్నేటివ్ నోబెల్ అని పిలుస్తారు) విన్నర్‌గా గ్రెటాను ప్రకటించారు నిర్వాహకులు. అవార్డు కింద ఆమెకు సుమారు ₹73 లక్షలు (83 వేల పౌండ్లు) అందించనున్నారు. స్వీడన్ ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తుంది. ‘‘వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు స్పందించాలని ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తించి ఈ అవార్డును ఇచ్చాం” అని అవార్డుకు ఆమె పేరును ప్రకటించిన స్వీడన్ ఫౌండేషన్ తెలిపింది. నోబెల్ ప్రైజులను ఇచ్చే రెండు రోజుల ముందు, అంటే డిసెంబర్ 4న స్టాక్‌హోంలో ఆమెకు అవార్డును అందించనున్నారు. అయితే, ఆ నెలలో ఆమె చిలీలో జరిగే వాతావరణ సదస్సుకు ఆమె వెళుతోంది. ఆమెతో పాటు మరో ముగ్గురినీ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని గ్రెటా చెప్పింది. ఈ అవార్డు తన ఒక్కదానికే సొంతం కాదని, ప్రపంచంలోని స్కూలు పిల్లలు, యువత, పెద్దల ఉద్యమ ఫలితం అని పేర్కొంది. స్కూల్ స్ట్రైక్ మూవ్మెంట్ అయిన ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్‌కు దక్కిన గుర్తింపు అని చెప్పింది. ఇక, ఇప్పటికే ఆమె పేరును నోబెల్ పీస్ ప్రైజుకు నామినేట్ చేశారు.