- ఎన్నికల కోడ్ ముగియడంతో మొదలైన గ్రీవెన్స్
- సమస్యలు చెప్పుకోవడానికి బారులుదీరిన పబ్లిక్
- భూసమస్యలపై పెద్దసంఖ్యలో అర్జీలు
నెట్‌వర్క్/హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ సోమవారం తిరిగి ప్రారంభమైంది. కోడ్ కారణంగా మూడు నెలలుగా వివిధ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న బాధితులు కలెక్టరేట్లకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కో జిల్లాలో వందలాది అర్జీలురాగా, ఎప్పటిలాగే ధరణి సమస్యలపైనే అత్యధిక ఫిర్యాదులు వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు రావడం గమనార్హం.
తన భూమిని కబ్జా చేసిన వ్యక్తి అధికారుల అండతో నిర్మాణం చేపట్టాడని, సీఎం న్యాయం చేయాలని ఉప్పల్ కి చెందిన వినోద్ కుమార్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. బీఆర్ఎస్ హయాంలో భూకబ్జాలు ఎక్కువయ్యాయని, ప్రభుత్వం మారినందున కొత్త సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. తన సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే వారం ప్రజావాణికి 10 లీటర్ల పెట్రోల్ తో వచ్చి సూసైడ్ చేసుకుంటానని హెచ్చరించాడు.
మంచిర్యాలలో భవన నిర్మాణ కార్మికులు..
మంచిర్యాల, వెలుగు : భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలో ఛలో కలెక్టరేట్ చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పడాల రామన్న ఆధ్వర్యంలో పలు డిమాండ్లపై అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్‌కు మెమోరాండం అందజేశారు. 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని, సాధారణ మరుణానికి రూ.6 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రామన్న కోరారు.
అలాగే పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే రిలీజ్ చేయాలని, బోగస్ లేబర్ కార్డులను అరికట్టాలని, పెళ్లి కానుకగా రూ.1.16 లక్షల ఆర్థికసాయం అందించాలని, పనిముట్ల కొలుగోలుకు రూ.10 లక్షల లోన్ ఇవ్వాలని, జీవితకాలం లేబర్ కార్డును కొనసాగించాలని, 2009లో తీసుకున్న లేబర్ కార్డులను ఆన్లైన్ చేయాలని, అడ్డా కార్మికుల కోసం రేకుల షెడ్లు, టాయ్‌లెట్లు నిర్మించాలని కోరారు.
ఇసుక తరలింపును ఆపేయాలని...
జనగామ, వెలుగు : జనగామ జిల్లా దేవరుప్పులలోని వాగు నుంచి ఇసుక తరలింపును నిలివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు జనగామ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. దేవరుప్పుల మండలం చిన్నమడూరు, కడవెండి, దేవరుప్పుల, పెద్దమడూరు రెవెన్యూ పరిధిలో గల రైతులు సుమారు 100 మంది వరకు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి దూసుకురావడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. చెన్నూరు రిజర్వాయర్ పనుల కోసం దేవరుప్పుల నుంచి ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పనుల్లో భాగమైన రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇసుక తరలింపునకు అవకాశం ఇచ్చామని, భూగర్భ జలాలు అడుగంటే విషయంపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో ఇసుక తరలింపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. భూగర్భ జలాల పరిస్థితిపై అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆర్డీవో కొమురయ్య, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, భూగర్భ జలశాఖ, గనుల శాఖల ఆఫీసర్లతో పాటు టెక్నికల్ బృందం పర్యటించి నివేదిక అందిస్తుందన్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా తీసుకుంటామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
‘డబుల్’ ఇండ్లు కేటాయించాలంటూ...
సూర్యాపేట/నిర్మల్, వెలుగు : డబుల్ ఇండ్లను కేటాయించాలంటూ సూర్యాపేట, నిర్మల్‌లో పలువురు లబ్ధిదారులు గ్రీవెన్స్‌కు హాజరై కలెక్టరేట్లకు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు లబ్ధిదారులకు ఎంపిక చేసి పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఇండ్లను కేటాయించలేదు. దీంతో సుమారు 200 మంది లబ్ధిదారులు కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ ఎస్.వెంకట్‌రావుకు అర్జీలు అందజేశారు. నిర్మల్‌లో డబుల్ ఇండ్లకు పట్టాలు జారీ చేయాలంటూ సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి మహమూద్ మాట్లాడుతూ డబుల్ ఇండ్లలో ఏడాది కాలంగా ఉంటున్నా ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదన్నారు. అలాగే కాలనీలో కనీస వసతులు సైతం లేవని, ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోందన్నారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు, పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ముందుగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
చెరువు కబ్జాపై ఫిర్యాదు
బీర్పూర్ మండలం కండ్లపల్లి, చర్లపల్లి గ్రామాల మధ్య ఉన్న ఘంటన చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కండ్లపల్లి గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్రమార్కులు జేసీబీ ద్వారా మట్టిని చెరువులో పోస్తూ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కబ్జాల కారణంగా 30 ఎకరాలకు పైగా ఉన్న చెరువు ప్రస్తుతం 15 ఎకరాలకు తగ్గిందని వాపోయారు. ఆఫీసర్లు సర్వే చేసి చెరువుకు సరిహద్దులు ఏర్పాటు చేయాలని కోరారు.
జాబ్స్ ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు
జగిత్యాల కలెక్టరేట్‌లో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన మహేశ్, రవీందర్, నాగరాజు, రవి, శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తులు కలెక్టరేట్‌లో జాబ్స్ ఇప్పిస్తామని రాధ, లక్ష్మి, గణేశ్‌ల వద్ద రూ. 2.60 లక్షలు వసూలు చేశారు. డబ్బులు తీసుకొని ఏడు నెలలు అవుతున్నా జాబ్స్ ఇప్పించడం లేదు. డబ్బులు ఇవ్వమని కోరినా పట్టించుకోవడం లేదని కలెక్టర్ యాస్మిన్‌బాషాకు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ మోసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.