
కరీంనగర్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు అప్లికేషన్లు భారీగా వచ్చాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్‌తో కొన్నివారాలుగా నిలిచిపోయిన గ్రీవెన్స్ సోమవారం యథావిధిగా కొనసాగించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలాసత్పతి అప్లికేషన్లు స్వీకరించారు.
226 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పవన్ కుమార్, డీఆర్‌వో బి.వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాలలో 50 ఫిర్యాదులు
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 50 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలోని 437 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని బీజేపీ లీడర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
తన కొడుకులు తన భూమిని బలవంతంగా పట్టా చేయించుకుని, తనను ఇంట్లోంచి వెళ్లగొట్టారని రాయికల్ మండలం అయోధ్యకు చెందిన ఎడ్ల నర్సవ్వ ఫిర్యాదు చేసింది. తన కొడుకు గోవర్ధన్ తన భూమి తీసుకొని తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని స్తంభంపల్లికి చెందిన లవంగం చిన్నమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవోలు మధుసుధన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.