కరీంనగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా ఆపేసిన గ్రీవెన్స్ ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. ఆయా జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. కరీంనగర్‌లో కలెక్టర్ పమేలా సత్పతి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మొత్తం 123 వినతులు రాగా ఇందులో 22 మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినవే ఉన్నాయి.
మిగతా వాటిలో పోలీస్ కమిషనర్ ఆఫీసుకు 6, డీపీఓకు 3, కరీంనగర్ రూరల్ తహసీల్‌కు11, వారధి సొసైటీకి 4, హుజూరాబాద్ ఆర్డీఓ ఆఫీసుకు 4 ఫిర్యాదులు రాగా, మిగిలిన శాఖలన్నింటికి కలిపి 73 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీఓ కె. మహేశ్వర్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ గాంధీ రోడ్డులోని ఓ ఇంట్లో తెరిచిన వైన్స్ షాపును పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని న్యూ గాడ్ గిఫ్ట్ క్లాత్ అండ్ రెడిమేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు గ్రీవెన్స్ సెల్ లో వినతిపత్రం సమర్పించారు.
ప్రజావాణిని నిర్లక్ష్యం చేస్తే చర్యలు
పెద్దపల్లి, వెలుగు: ప్రజావాణిని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను హెచ్చరించారు. పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులపై కలెక్టర్అసహనం వ్యక్తం చేశారు. ప్రజావాణి సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం సరికానద్నారు. జిల్లా అధికారులు, శాఖల అధికారులు హాజరు కాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల వినతి
జగిత్యాల రూరల్, జగిత్యాల టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం వలన తాము నష్టపోతున్నామని ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ కుటుంబాలు రోడ్డు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి ఆదుకోవాలని కోరారు. జగిత్యాల రూరల్ మండలం దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో అమ్మే లడ్డూలలో నాణ్యత లోపించిందని ఎర్రోజుల అశోక్ కుమార్ అనే భక్తుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
ప్రభుత్వ భూమి కబ్జాను అరికట్టండి
కొత్తపల్లి మండలం చింతకుంటలోని ప్రగతినగర్ కాలనీలో అప్పటి ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించినప్పుడు సర్వే నెంబర్ 439లో ఆలయాల నిర్మాణం, డెవలప్మెంట్ కోసం కొంత ప్రభుత్వ భూమిని మార్కింగ్ చేసి పెట్టింది. కొందరు అక్రమార్కులు ఆ మార్కింగ్ చెరిపివేసి దొంగ కాగితాలతో కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ కబ్జాలను అరికట్టి ప్రగతినగర్ డెవలప్ మెంట్ కి కేటాయించాలని కోరాం.
ప్రగతినగర్ కాలనీవాసులు, కరీంనగర్