200 యూనిట్లలోపు కరెంట్​ కాల్చేవాళ్లు బిల్లులు కట్టొద్దు : కవిత

నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్​ ప్రకటించిన గృహజ్యోతి పథకం కింద 200లోపు యూనిట్లు కాల్చేవారు  కరెంట్  బిల్లులు కట్టవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. బిల్లులు కట్టొద్దని  గతంలో కాంగ్రెస్ లీడర్లు చేసిన ప్రకటనను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుధవారం నిజామాబాద్ మండలంలోని నర్సింగ్​పల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని జనవరి నుంచచే అమలు చేయాలన్నారు. ఇప్పటికే రూ.2 వేల పింఛన్ పొందుతున్న వారి నుంచి కొత్తగా దరఖాస్తులేవీ తీసుకోకుండా.. 

కాంగ్రెస్ ​మేనిఫెస్టో ప్రకారం రూ.4 వేల పింఛన్ ​వచ్చే నెల నుంచే  ఇవ్వాలన్నారు. కొత్త రేషన్​కార్డుల వివరాలు మీ–సేవా కేంద్రాల్లో ఉన్నాయని, వాటిని మొదట మంజూరు చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో నిరుద్యోగ భృతి అంశాన్ని చేర్చాలన్నారు. రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదనే చర్చ గ్రామాల్లో జరుగుతోందని, సర్కారు స్పందించాలన్నారు.