
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో గృహలక్ష్మీ పథకం లబ్దిదారుల ఎంపికలో అవతవకలు జరిగాయంటూ మహిళలు ధర్నాకు దిగారు. అనుచరులకే గృహలక్ష్మీ పథకాన్ని వర్తింప చేశారంటూ స్థానిక సర్పంచ్ పై మహిళలు మండిపడ్డారు.
గుడిసెలు, పెంకుటిల్లు, రేకులు ఉన్న పేదవాళ్లను పక్కనపెట్టి.. రెండు, మూడు అంతస్తుల భవనాలు ఉన్నవారికే గృహలక్ష్మి పథకం వర్తింపజేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే పేదలకు న్యాయం చేయాలని సవాల్ విసిరారు. తాము నివాసం ఉంటున్న ఇళ్లను చూసి విచారణ జరిపించిన తర్వాతే గృహలక్ష్మి పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మేడలు, మిద్దలు ఉన్న వారికే గృహలక్ష్మి పథకం వర్తిస్తుందా.. మాలాంటి నిరుపేదలకు పథకం అమలు చేయరా అని నిరుపేదలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహలక్ష్మి పథకం అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ నాయకులకే గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపించారు.
కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 226లో కొందరు బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా ప్లాట్లు చేసుకొని అమ్ముకున్న వారిని వదిలేసి.. పేదలను అక్కడనుంచి ఖాళీ చేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా నిర్మాణాలు గుడిసెలు వేసుకున్న వారిని వదిలేసి నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే అధికారుల అండదండలతో ఖాళీ చేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.