వివాదాల్లో జీఆర్ఎంబీ ! తెలంగాణ అధికారుల డిప్యూటేషన్లపై పెత్తనం

వివాదాల్లో జీఆర్ఎంబీ ! తెలంగాణ అధికారుల డిప్యూటేషన్లపై పెత్తనం
  • ఓ అధికారికి ఏడాది పాటు టర్మ్  పొడిగించిన ఈఎన్​సీ 
  • పొడిగించడానికి మీరెవరు అంటూ మెంబర్​ సెక్రటరీ అళగేశన్​ లేఖ
  • ఇష్టమొచ్చినట్టు పొడిగింపులు, డిప్యూటేషన్లు ఇస్తే ఒప్పుకోబోమని వ్యాఖ్య
  • అళగేశన్  తీరుపై అధికారుల ఆగ్రహం 
  • బోర్డుకు అధికారులను డిప్యూట్​ చేసే పవర్  పూర్తిగా మనదే

హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ) వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. ఇప్పటికే తెలంగాణ ఉద్యోగులపై తీవ్ర వివక్షను చూపిస్తున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బోర్డు మెంబర్​  సెక్రటరీ అళగేశన్​.. ఇప్పుడు మరో వివాదానికి కారకుడయ్యారు. బోర్డులో తెలంగాణ అధికారుల డిప్యూటేషన్​ పొడిగింపు, విచ్చలవిడిగా అలవెన్సుల క్లెయిమ్​లకు సంబంధించి ఆయన తీరు మన అధికారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. 

ఇటీవల బోర్డులో ఓ మహిళా అధికారి డిప్యూటేషన్​ పూర్తి కావడంతో.. ఆమె డిప్యూటేషన్​ను మరో ఏడాదిపాటు ఈఎన్​సీ (అడ్మిన్) పొడిగించారు. దీనిపై ఈఎన్​సీకి అళగేశన్  లేఖ రాసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు డిప్యూటేషన్లు చేసే అధికారమే ఈఎన్ సీకి లేదన్నట్లు లేఖలో పేర్కొన్నారు. బోర్డు ఆమోదించిన రిక్రూట్​మెంట్​ రూల్స్​నే ఫాలో కావాలని ఈఎన్​సీని ఆదేశించినట్లు లేఖ రాశారు. దీనిని ఒప్పుకోబోమని, ఇంకోసారి ఇలా ఇష్టమొచ్చినట్లు డిప్యూటేషన్లకు ఎక్స్​టెన్షన్​ ఇవ్వకూడదన్నారు.

 అళగేశన్  తీరుపై మన అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డులో ఎవరిని ఉంచాలి, ఎవరిని వెనక్కి తీసుకోవాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని, దీని గురించి అడగడానికి ఆయన ఎవరంటూ మండిపడుతున్నారు. వాస్తవానికి బోర్డు ఏర్పాటు సమయంలోనే డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను డిప్యూట్​ చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఇరిగేషన్​ శాఖకే అధికారం ఇచ్చింది. అందుకు తగినట్టు రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. మ్యాన్​పవర్​కు అనుగుణంగా బోర్డుకు అధికారులు, ఉద్యోగులను కేటాయించారు. అందులో కొందరి డిప్యూటేషన్ల టర్మ్  పూర్తి కావస్తుండడంతో వారిని పొడిగిస్తున్నారు. మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడి అవసరాలకు అనుగుణంగానే అధికారులను బోర్డుకు ఇచ్చే పూర్తి అధికారం మన చేతుల్లోనే ఉంది. అయినా కూడా.. పెత్తనం మొత్తం బోర్డుదే అనేలా అళగేశన్ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అడ్డగోలుగా అలవెన్సులు

బోర్డు అధికారులు ఆఫీసుకు రావడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి ఇరిగేషన్​ డిపార్ట్​మెంటే రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నది. అందులో భాగంగానే మెంబర్  సెక్రటరీకి ప్రత్యేకంగా కారు కేటాయించింది. ఇలాంటి సందర్భంలో సదరు అధికారి అలవెన్సులను క్లెయిమ్​ చేయడానికి లేదు. ఆ అధికారి సొంత వాహనం ఉపయోగిస్తేనే అలవెన్సులకు అర్హుడు. కానీ, అళగేశన్​ మాత్రం డిపార్ట్​మెంట్​ ఇచ్చిన కారును వాడుతూ.. నెలనెలా రూ.40 వేల టీఏ కూడా క్లెయిమ్​ చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

ఆరోపణలపై ఇప్పటికీ స్పందించని కేంద్రం

అళగేశన్​పై ఇప్పటికే బోర్డులోని తెలంగాణ అధికారులు ఇటు బోర్డు చైర్మన్​తో పాటు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశారు. అళగేశన్  కావాలని వివక్ష చూపిస్తున్నారని, మహిళా అధికారులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే, ఇప్పటి వరకు జలశక్తి శాఖ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం వివరణ కూడా అడగలేదు. పైగా ఆయనేది చెబితే అదే అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలూ ఉన్నాయి.