గోదావరి బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌ వాయిదా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు(జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ) 13వ సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. శుక్రవారం జలసౌధలో బోర్డు పూర్తి స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చారు. అయితే ఏపీ నుంచి ఒక్క అధికారి కూడా రాలేదు. వివిధ కారణాలతో తాము మీటింగ్‌‌‌‌‌‌‌‌కు రాలేకపోతున్నామని శుక్రవారం ఉదయం ఏపీ అధికారులు బోర్డుకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, అప్పటికే జలసౌధకు వచ్చినా సమావేశానికి దూరంగా ఉన్నారు.

జీఆర్ఎంబీ చైర్మన్ ఎంసీ సింగ్, తెలంగాణ ఈఎన్ సీ మురళీధర్, సబ్ కమిటీ సభ్యుడు శ్రీధర్ దేశ్ పాండే, ఇంజనీర్లు హాజరయ్యారు. బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు మెంబర్లుగా, ఈఎన్ సీలు టెక్నికల్ మెంబర్లుగా ఉంటారు. నిబంధనల ప్రకారం కోరం పూర్తి కాలేదని మెంబర్ సెక్రటరీ అజగేషన్ ప్రస్తావించారు. దీంతో మీటింగ్ వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రకటించారు. మార్చి 11న కూడా ఏపీ సభ్యుల గైర్హాజరుతో సమావేశం వాయిదా వేశారు.