- మహిళా ఉద్యోగులపై జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ వేధింపులు
- డ్రెస్సింగ్‌పై కామెంట్లు.. బాడీ షేమింగ్ వ్యాఖ్యలు
- లైంగిక వేధింపుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటున్న బోర్డు ఉద్యోగులు
- తనపై ఫిర్యాదు చేసిన ఉద్యోగులకు మెమోలు జారీ
- మరోసారి కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేయనున్న ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మెంబర్ సెక్రటరీ అళగేశన్పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మహిళలను వేధించడమే కాకుండా.. ఆర్థిక అవకతవకలకు కూడా పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళా అధికారులు, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను తెలుసుకుని.. ఏవైనా సమస్యలుంటే మీటింగుల్లో బహిర్గతం చేశారని తెలిసింది. మహిళా ఉద్యోగుల డ్రెస్సింగ్ స్టైల్‌పై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసేవారని సమాచారం. మహిళలను అసభ్యకరంగా చూసేవారని, పనిపేరిట పిలిచి తన చాంబర్లో గంటలకొద్దీ కూర్చోబెట్టుకునేవారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
వీకెండ్స్‌లో ఇంటికి లంచ్ లేదా డిన్నర్‌కు పిలవాలని మహిళా ఉద్యోగులకు చెప్పేవారని అంటున్నారు. మహిళా ఉద్యోగులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారని చెబుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అంటున్నారు. ఆయనపై ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు చాలా వచ్చాయని, కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. మహిళలపై బాడీ షేమింగ్ కామెంట్లు, లైంగిక వేధింపులపై ఇప్పటికే గతేడాది చైర్మన్‌కు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారని అంటున్నారు.
ఆర్థిక అక్రమాలు కూడా..
మహిళలపై వేధింపులే కాకుండా ఆర్థిక అవకతవకలకూ అళగేశన్ పాల్పడ్డారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సు తీసుకుంటూనే.. ప్రభుత్వ వాహనాన్ని వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చైర్మన్ అనుమతి లేకుండానే ఇటీవల బెంగళూరు ట్రిప్పులో ఆటో, కార్ చార్జీల రూపంలో రూ.13 వేలు డ్రా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. కంటి సర్జరీ కాకుండానే సర్జరీ అయినట్టు చెప్పి ఇంట్రా ఆక్యులర్ లెన్స్ కోసం రూ.21 వేలు తీసుకున్నారని చెబుతున్నారు.
జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కి సంబంధించిన అధికారులకు నిర్వహించిన క్లాసులకు ఒక్కో దానికి రూ.10 వేల చొప్పున వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఎంపిక విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. స్టేట్ గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం కాకుండా.. కేంద్ర ప్రభుత్వ ఎక్స్పెన్సెస్ను మెన్షన్ చేస్తూ బిల్లులు డ్రా చేశారని అంటున్నారు.