వరుడి డ్యాన్స్.. పెండ్లిని రద్దు చేసిన వధువు తండ్రి

వరుడి డ్యాన్స్.. పెండ్లిని రద్దు చేసిన వధువు తండ్రి

న్యూఢిల్లీ: పెళ్లిలో సరదాగా తన ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేసిన వరుడికి వధువు తండ్రి షాక్ ఇచ్చాడు. పాపులర్ బాలీవుడ్ సాంగ్ ‘చోళీ కే పీఛే క్యా హై’ కు వరుడు డ్యాన్స్ చేయడంతో పెళ్లి కూతురు తండ్రి ఆగ్రహం చెంది వేడుకను రద్దు చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. ఇటీవల ఓ వరుడు తన పెళ్లి ఊరేగింపుతో ఢిల్లీలోని వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో వరుడి స్నేహితులు ఫేమస్ బాలీవుడ్ పాట ‘చోళీ కే పీఛే క్యా హై’ పెట్టి అతడిని డ్యాన్స్ చేయాలని కోరారు.

 వేడుకకు వచ్చిన కొంత మంది అతిథులు కూడా వరుడిని ఉత్సాహపరిచారు. దీంతో అతడు ఆ సాంగ్ కు కాలు కదిపాడు. వరుడి తీరు కాబోయే మామకు నచ్చకపోవడంతో పెళ్లి వేడుకలను నిలిపేశాడు. వివాహాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. కుటుంబ విలువలను వరుడు అవమానించాడంటూ ఆరోపించాడు. ఈ అనూహ్య పరిణామంతో వధువు కంటతడి పెట్టుకుంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. పెళ్లి వేడుకను రద్దు చేసి వధువు తండ్రి సరైన నిర్ణయమే తీసుకున్నాడని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. తన పెళ్లిలో ఇటువంటి పాటలు పెడితే తాను తప్పకుండా డ్యాన్స్ చేసే వాడినని మరో నెటిజన్ పేర్కొన్నాడు.