వాషింగ్టన్: అమెరికా వాషింగ్టన్‌లో విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా చనిపోయినట్లు స్థానిక మీడియా సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన మొత్తం 67 మందిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపాయి.
అందులో ఒకరు జీఈ ఏరోస్పేస్ కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్న వికేశ్ పటేల్, మరొకరు వాషింగ్టన్ డీసీ బేస్డ్ కన్సల్టెంట్ అస్రా హుస్సేన్ రాజాగా గుర్తించినట్లు వివరించాయి. వికేశ్ పటేల్ మృతిపై జీఈ ఏరోస్పేస్ సంస్థ స్పందించింది.
వికేశ్ మరణం సంస్థకు తీరనిలోటని, జీఈ ఏరోస్పేస్ బృందానికి ఇది చాలా బాధ కలిగించే వార్త అని తెలిపింది. బాధిత కుటుంబాలకు తమ సానుభూతి తెలియజేస్తున్నట్లు జీఈ ఏరోస్పేస్ పేర్కొంది. అలాగే, అస్రా హుస్సేన్ రాజా(26) మృతిపై ఆమె మామ డాక్టర్ హషీమ్ రాజా స్పందించారు.
అస్రా హుస్సేన్ నెలకు రెండుసార్లు కాన్సాస్ లోని విషుత సిటీకి వెళుతుందని, అక్కడ ఓ ఆసుపత్రికి సంబంధించిన టర్నరౌండ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తోందని చెప్పారు.