నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల కుమారులు, ముగ్గురు ఎమ్మెల్యేల బ్రదర్స్ అధికారిక కార్యక్రమాలకు చీఫ్ గెస్టులుగా హాజరవుతుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల స్థానంలో హాజరై ప్రారంభాలు, పంపిణీలు చేస్తుండడంతో బీఆర్ఎస్సీనియర్లు, సెకండ్ క్యాడర్లీడర్లు గుర్రుగా ఉన్నారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే సీనియర్లు, తెలంగాణ ఉద్యమ కారులు పార్టీ హైకమాండ్‌కు కంప్లైంట్‌కూడా చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని హైకమాండ్హెచ్చరించినా మార్పు రావడం లేదని పలువురు లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు షాడోలుగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రతి పక్ష పార్టీల లీడర్లు కూడా ఆరోపిస్తున్నారు.
ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ముందస్తు ప్లాన్..
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బాన్సువాడ, నిజామాబాద్రూరల్ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ కుమారులు తండ్రుల స్థానంలో హాజరవుతూ నియోజకవర్గాల్లో హల్చల్చేస్తున్నారు. ధర్పల్లి జడ్పీటీసీగా ఉన్న నిజామాబాద్రూరల్ఎమ్మెల్యే కుమారుడు బాజిరెడ్డి జగన్ మండల అభివృద్ధి పనులకే పరిమితం కావాల్సి ఉండగా, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్చెక్కులను ఎమ్మెల్యే గోవర్ధన్లేకున్నా ఆయన పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్సీనియర్లు, సెకండ్క్యాడర్లీడర్లు బహిరంగంగా వ్యతిరేకించకున్నా.. అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బాన్స్వాడ స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు సురేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎలాంటి హోదా లేకున్నా.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సురేందర్‌రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి వర్గీయులే ఆయన తీరును వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల కోటగిరి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పోచారం సురేందర్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
ఎమ్మెల్యే స్థానంలో ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీల లీడర్లు నిలదీశారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్భార్య, తమ్ముడు సొహెల్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే సోదరుడు రాకేశ్షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు పోస్టింగులు, కాంట్రాక్ట్ పనులు, సెటిల్మెంట్లు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
పోటా పోటీగా వారసుల ప్రయత్నం..
స్పీకర్పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ వయస్సు రీత్యా వారి కుమారులు తండ్రుల స్థానాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పోచారం కుమారులు సురేందర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇద్దరూ తండ్రి సీటు దక్కించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భాస్కర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా ఉండడంతో డీసీసీబీ లోన్ల పంపిణీతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
సురేందర్‌రెడ్డి పార్టీ క్యాడర్, తండ్రి వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్కొడుకు జగన్‌కూడా జడ్పీటీసీగా ఉంటూ మండలానికే పరిమితం కాకుండా నియోజకవర్గం అంతా కలియతిరుగుతూ క్యాడర్‌కు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాననే సంకేతాలిస్తున్నారు.