వరుడి బట్టతల చూసి వధువు షాక్.. ఆగిన పెళ్లి

అబద్దం... ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనిపించేలా చేస్తుంది. కానీ నిజం అనేది నిప్పు లాంటిది. ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి దహించివేస్తుంది. అలాంటి సంఘటనే ఓ పెళ్లి కొడుకు విషయంలో జరిగింది. వంద అబద్దాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలని అంటారు. అలాంటిది నేను ఒక్క చిన్న  అబద్దం చేస్తే తప్పేంటీ అనుకున్నాడో, లేదంటే తనకున్న లోపాన్ని సాకుగా చూపి పిల్లనివ్వరేమో అనుకున్నాడో.. కానీ ఒక నిజం దాచి అందరి ముందూ దోషిలా నిలబడే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆ వరుడు. 

ఇక వివరాల్లోకి వెళితే..  ఉత్తర్‌ప్రదేశ్‌ ఉన్నావ్‌లో ఓ పెళ్లి కుమారుడు తనకు బట్టతల ఉందన్న నిజాన్ని, పెళ్లి కూతురు, ఆమె తరపు బంధువులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ అతని ప్లాన్ అంతా రివర్స్ అయింది. వివాహ వేడుకలో భాగంగా కార్యక్రమాల్లో పాల్గొన్న పెళ్లి కొడుకు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని లేపేందుకు వధువు సోదరుడు ప్రయత్నించి.. తలపాగా తీసే క్రమంలో వరుడి విగ్గు ఊడిపోవడంతో అందరూ విస్తుపోయి చూస్తుండిపోయారు. ఊహించని ఘటనతో షాక్ కు గురైన బంధువులు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది. మోసం చేసి పెళ్లి చేయాలని చూశారని పెళ్లి కూతురు బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి... ఇరు కుటుంబాలను శాంతింపజేశారు. అయితే అధికారికంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఒక వేళ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తల కోసం...

క్షుద్ర పూజలు చేస్తమని  రూ. 7 లక్షలతో పరార్​ 

ఇండియాలో పెరుగుతున్న ‘యాపిల్‌’ ప్రొడక్షన్‌