- గింజ పెరగక ముందే మొక్కలను పీకేస్తున్న కోతులు
- చీడపీడలు, తెగుళ్లతో మరింత తగ్గుతున్న దిగుబడి
- ఎకరాకు 15 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 8 క్వింటాళ్లే పరిమితం
- చేతికొచ్చిన పంటకూ మార్కెట్‌లో దక్కని మద్దతు ధర
- పల్లికి బదులు పత్తి, మిర్చి, మక్క వైపు మళ్లుతున్న రైతులు
వరంగల్/వనపర్తి, వెలుగు : ఇన్నాళ్లూ పల్లి వేసిన రైతులు ఇటీవలి కాలంలో ఆ పంట సాగుకు ఆసక్తి చూపడం లేదు. పంట చేతికొచ్చే దశలో కోతులు పడి నాశనం చేస్తాయన్న భయానికి తోడు చీడపీడలు, తెగుళ్ల కారణంగా దిగుబడి భారీ స్థాయిలో తగ్గిపోతోంది. చివరకు మిగిలిన పంటతో మార్కెట్‌కు వెళ్తే క్వాలిటీ లేదన్న సాకుతో వ్యాపారులు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. ఇన్ని ఇబ్బందుల నడుమ పల్లి సాగు చేయడం కంటే.. ఇతర పంటలు వేయడమే మేలని భావిస్తున్న రైతులు ఆ పంట సాగును తగ్గించేస్తున్నారు. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ సారి పల్లి సాగు సగానికి సగం పడిపోయింది.
కోతులు, తెగుళ్లతో తగ్గుతున్న దిగుబడి
గ్రామాల్లో కోతుల గుంపులు పల్లి పంటలపై దాడులు చేస్తున్నాయి. కాయలో గింజ పెరగడానికి ముందే మొక్కలను వేర్లతో సహా పీకిపడేస్తున్నాయి. వందలాదిగా వచ్చే కోతుల బారి నుంచి రైతులు తమ పంటలను కాపాడుకోలేక ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇదిచాలదన్నట్లుగా అకాల వర్షాలతో పూత రాలి, ఊడలు తగ్గిపోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా వేరుశనగకు ఆకుపీల్చే పురుగు, తెగుళ్లు సోకడంతో కాయకు మచ్చలు పడుతున్నాయి. దీంతో గింజ ఎదగడం లేదు. వీటికి తోడు అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతింది. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, కోతులు, తెగుళ్ల కారణంగా దిగుబడి ఎనిమిది క్వింటాళ్లకు పడిపోయింది.
పత్తి, మిర్చి వైపు రైతుల చూపు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ ఏడాది పల్లి సాగు సగాని కంటే ఎక్కువగా తగ్గిపోయింది. పల్లి పంటకు ఫేమస్‌గా భావించి, అంతో ఇంతో ఎక్కువ ధర వచ్చే వనపర్తి జిల్లాలో గతంలో 25 వేల ఎకరాల్లో పల్లి సాగైతే, ఈ సారి 11 వేల ఎకరాలకే పరిమితమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని నర్సంపేట, వర్దన్నపేట, ఏటూరునాగారం, ధర్మసాగర్, వేలేరు, తొర్రూర్, శాయంపేట, పరకాల, కమలాపూర్ వంటి ఏరియాల్లో గతంలో దాదాపు 12 నుంచి 14 వేల ఎకరాల్లో పల్లి సాగు అయితే ఈ సారి ఆరు నుంచి ఏడు వేల ఎకరాలకే పరిమితమైనట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. పల్లి స్థానంలో పత్తి, మిర్చి, మక్క సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారని అధికారులు అంటున్నారు.
దక్కని మద్దతు ధర
వేరుశనగ ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఏడాది కాలంలో సగటున 13 శాతం వరకు ధర తగ్గడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. వేరుశనగకు కేంద్రం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6,783గా నిర్ణయించింది. వనపర్తి మార్కెట్‌లో గతేడాది జనవరిలో క్వింటాల్ పల్లి రూ. రూ.6,826 పలుకగా, ప్రస్తుతం రూ.5,944కు తగ్గింది. నెల రోజుల కింద డిసెంబరులో క్వింటాల్ పల్లి సగటున రూ.6,205గా పలికింది. కానీ ప్రస్తుతం గరిష్టంగా రూ.6,517 పలుకుతుండగా, కనిష్టంగా రూ.4,500 పలకడంతో రైతులు ఆగమవుతున్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో పల్లి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,330 పలకగా, మాడల్ ధర రూ.5,200, కనిష్టంగా రూ.4,170 మాత్రమే చెల్లించారు. క్వాలిటీ పేరుతో రేట్లలో కోత పెడుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు ఖర్చు రూ.40 వేలు.. చేతికొచ్చేది రూ.35 వేలు
ఎకరం పొలంలో పల్లిసాగు చేయాలంటే విత్తనాలకే రూ. 13 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దుక్కి దున్నడం, పిండి సంచులు, కలుపుతీత, ఏరడం, రవాణా చార్జీలతో కలిపి మొత్తంగా ఎకరం పల్లి సాగుకు రూ. 40 వేలు ఖర్చు అవుతోంది. వివిధ కారణాలతో ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడే వస్తుండడంతో రైతులకు రూ.33 వేల నుంచి రూ.35 వేలు మాత్రమే చేతికొస్తున్నాయి. దీంతో పెట్టుబడి కూడా రాకపోగా, తమ కష్టమంతా వృథా అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధర లేక అప్పులు పెరిగినయ్
నేను మూడెకరాల్లో వేరుశనగ వేసిన. దిగుబడి ఎకరాకు ఏడున్నర క్వింటాళ్లే వచ్చింది. మార్కెట్ల రేటు చూస్తే చాలా తక్కువగా ఉంది. నేను సరుకును మార్కెట్‌కు తీస్కపోయే సమయానికి ధర ఎట్లుంటదో తెల్వదు. కనీస మద్దతు ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – శాంతన్న, అమ్మపల్లి, పెద్దమందడి