‘కామారెడ్డి’లో వేగంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు

  •     4 నెలల్లో 4.80 మీటర్ల లోతులోకి పడిపోయిన నీళ్లు
  •     ఎండాకాలం షురూ కాకముందే ఆగి పోస్తున్న బోర్లు
  •     ఎక్కువగా వరి సాగు,  భారీ ఎండలే కారణం
  •     రైతులు పొదుపుగా వాడుకుంటేనే  మేలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో  భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. 4 నెలల వ్యవధిలోనే  నీటి మట్టాలు 4. 80 మీటర్ల లోతులోకి వెళ్లాయి. ఎండలు ముదరక ముందే  నెల రోజుల వ్యవధిలో 1.80 మీటర్ల లోతుల్లోకి నీటి మట్టాలు పడిపోవడంతో పొలాల్లోని బోర్లు ఆగి ఆగి సన్నగా పోస్తున్నాయి.  జిల్లాలో యాసంగి సీజన్​లో అంచనాకు మించి రైతులు వరి సాగు చేశారు. 2.50 లక్షల ఎకరాల్లో వరి  సాగు చేస్తే , ఇందులో  లక్షా  90 వేల ఎకరాల వరకు  బోర్ల మీదే ఆధారపడి సాగు చేశారు. వరి పంటకు నీటిని ఎక్కువగా వినియోగించడం, ఎండలు షురూ కావడంతోనే నీటి మట్టాలు అడుగంటుతున్నాయని అధికారులు చెప్తున్నారు. పొదుపుగా వాడుకుంటేనే పంటలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.   

రైతుల్లో ఆందోళన..

ఎండా కాలం ఆరంభంలోనే నీళ్లు అడుగంటుతుండడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు.  సాగు నీటి  ప్రాజెక్టులు అంతగా లేని జిల్లాలో  ఎక్కువగా భూగర్భజలాల మీదే ఆధారపడి  రైతులు పంటలు సాగు చేస్తారు. ఈ యాసంగిలో  4.10 లక్షల ఎకరాల్లో  వివిధ  రకాల పంటలు సాగు కాగా,  ఇందులో వరి 2.50 లక్షల ఎకరాల్లో సాగైంది.  ప్రాజెక్టులు, చెరువుల కింద వరి  60 వేల ఎకరాల వరకు ఉంటే మిగతా లక్షా 90  వేల ఎకరాలు బోర్ల కిందే ఉంది. నిరుడు యాసంగి కంటే ఈ యేడు అదనంగా 90 వేల ఎకరాల్లో వరి సాగు   పెరిగింది. బోర్లు బాగా పోస్తుండడం, వరి  సాగుపై  ఆంక్షలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం  పెరిగింది. ఈ పరిస్థితుల్లో  వరికి నీటి వినియోగం ఎక్కువ అవసరం కావడంతో బోర్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు.  2022 నవంబర్​లో  జిల్లా సగటు నీటి మట్టం 5.84 మీటర్లు ఉండగా  ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి సగటు నీటి మట్టం  10.64 మీటర్ల లోతుల్లోకి చేరింది.  2022 డిసెంబర్​లో   7.08 మీటర్లు, ఈ ఏడాది జనవరిలో   8.84 మీటర్లు, ఫిబ్రవరిలో  10.64 మీటర్ల లోతుల్లో నీటి మట్టాలు ఉన్నాయి.

ఎక్కువ నీటి వినియోగంతోనే ఈ పరిస్థితి

వరి పొలాలకు ఎక్కువ నీరు అవసరం పడుతుండడంతో  బోర్లతో అడ్డగోలుగా తోడేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నీటి మట్టాలు బాగా లోతుల్లోకి చేరుతున్నాయి. రైతులు ఇక నుంచి పొదుపుగా వాడుకుంటేనే ఫలితం ఉంటుంది. లేక పోతే వరి పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది.  - సతీశ్​ యాదవ్, జిల్లా భూగర్భ జల అధికారి 

జిల్లాలో పరిస్థితి ఇది..

జిల్లాలో  కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో  భూగర్భజలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ఎక్కువగా  తాడ్వాయి మండలం అన్నారంలో  31.84 మీటర్ల లోతుల్లోకి చేరాయి.     భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో  20.63 మీటర్లు, మల్లుపల్లిలో  17.07 మీటర్లు,    గాంధారి మండలం రాంలక్ష్మణ్​పల్లిలో 16.61,  సర్వాపూర్​లో 16.19, దోమకొండ మండల కేంద్రంలో  13.34, కామారెడ్డి మండలం అడ్లూర్​లో 12.44 , రాజంపేట మండలం కొండాపూర్​లో  11.37,   ఆర్గొండలో   10.63 మీటర్ల లోతుల్లోకి నీళ్లు చేరాయి.   భిక్కనూరు, బీబీపేట, దోమకొండ,  కామారెడ్డి,  రాజంపేట, తాడ్వాయి, మాచారెడ్డి , సదాశివనగర్​, గాంధారి , పిట్లం మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో  బోరు బావులు ఎక్కువగా ఉంటాయి.