- కామారెడ్డి జిల్లాలో 4 నెలల్లో 4.75 మీటర్ల కిందకు..
- తాడ్వాయి మండలం కన్కల్లో 32.89 మీటర్ల లోతులో నీళ్లు
కామారెడ్డి, వెలుగు: బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసే కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్నెలాఖరు వరకు సగటున 4.75 మీటర్ల లోతుకు నీటి మట్టాలు పడిపోయాయి. యాసంగి సాగులో భాగంగా రైతులు బోర్లతో నీటిని తోడేయడం, 15 రోజులుగా ఎండలు తీవ్రమవ్వడంతో నీళ్లు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సగటున నీటి మట్టాలు 13.59 మీటర్ల లోతులో ఉంది. జనవరిలో 8.84 మీటర్ల లోతులో ఉండా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఫిబ్రవరిలో 10.64 మీటర్లకు, మార్చిలో 12.16 మీటర్లకు పడిపోయాయి. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. అత్యధికంగా 3.50 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరికి నీటి వినియోగం ఎక్కువ. 2.75 లక్షల ఎకరాల్లో బోర్ల కిందనే సాగు చేశారు. దీంతో భూగర్భ జలాలు భారీగా తగ్గిపోయాయి.
ఈ ఏరియాల్లో ఎక్కువగా..
ఏప్రిల్నెలాఖరు నాటికి జిల్లాలోని పలు ఏరియాల్లో భారీగా నీటి మట్టాలు పడిపోయాయి. తాడ్వాయి మండలం కన్కల్లో 32.89 మీటర్ల లోతులోకి, లింగంపేట మండలం మోతేలో 29.19 మీటర్లు, భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో 26.35 మీటర్లు, గాంధారి మండలం సర్వాపూర్లో 20.28 మీటర్లు, బీర్కుర్ మండలం గుండెనెమ్లిలో 17.90 మీటర్లు, రాజంపేట మండలం ఆర్గొండలో16.43 మీటర్లు, బీబీపేటలో16.17 మీటర్లు, దోమకొండలో15.88 మీటర్ల లోతులోకి నీటి మట్టాలు పడిపోయాయి.