
భాగ్యనగరం హైదరాబాద్ లో జనానికి ప్రధాన సమస్యలు ఒకటి ట్రాఫిక్ అయితే.. మరొకటి వాటర్ ప్రాబ్లమ్.ఎండాకాలం మొదలైందంటే చాలు.. సిటీ జనాల్లో నీటి కష్టాల భయం మొదలవుతుంది. అయితే.. ఈ ఏడాది కాస్త ముందుగానే హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి.. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతుండటంతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అడుగంటాయి. బోర్లలో వాటర్ లెవెల్స్ తగ్గుతున్న క్రమంలో సిటీలో వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా ఏరియాల్లో జనం వాటర్ ట్యాంకర్ల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ట్యాంకర్ల కోసం డబుల్ బుకింగ్స్:
గతేడాదితో పోలిస్తే.. వాటర్ ట్యాంకర్ల కోసం ఈ సారి ఇప్పటికే డబుల్ బుకింగ్స్ వస్తున్నాయని అధికారులు అంటున్నారు. డిమాండ్ పెరుగుతుండటంతో వాటర్ ఫిల్లింగ్ పాయింట్స్ ను పెంచే దిశగా జలమండలి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా 9 వందల వాటర్ ట్యాంకర్లతో రెండు షిఫ్టుల్లో వాటర్ ట్యాంకర్స్ సప్లై చేస్తోంది జలమండలి. అవసరమైతే మూడు షిఫ్టుల్లో వాటర్ ట్యాంకర్స్ సప్లై చేస్తామంటున్నారు అధికారులు. ఇందుకోసం రిపెయిర్ లో ఉన్న వాటర్ ట్యాంకర్లను రెడీ చేయిస్తున్నట్లు తెలిపారు అధికారులు.
డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్:
వచ్చే మూడు నెలల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగే అవకాశముండటంతో.. అవసరమైతే మరిన్ని వెహికిల్స్ ను హైర్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది జలమండలి. వాటర్ ట్యాంకర్లను ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలని.. ప్రస్తుతం బుక్ చేసుకున్న 24 గంటల్లో ట్యాంకర్ పంపుతున్నామని తెలిపారు అధికారులు. వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ లో ఫిల్లింగ్ టైమ్ తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నామని.. ప్రస్తుతం డొమెస్టిక్ అవసరాలకు రూ. 500 కు 5వేల లీటర్ల ట్యాంకర్ పంపుతున్నామని, కమర్షియల్ అవసరాలకు రూ. 850కి 5వేల లీటర్ల ట్యాంకర్ పంపుతున్నామని తెలిపారు అధికారులు.