రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పెరిగిన గ్రౌండ్ వాటర్

  • మేడ్చల్​లో అనూహ్యంగా పడిపోయిన భూగర్భజలాలు
  • కూకట్ పల్లిలో 6.21 మీటర్లకు పడిపోయిన వాటర్ శేరిలింగంపల్లిలో 
  • 5.38 మీటర్లు పెరుగుదల  ఇంకుడు గుంతలు లేకపోవడమే గ్రౌంట్ వాటర్ తగ్గడానికి కారణమంటున్న ఆఫీసర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గతేడాది అక్టోబర్​తో పోలిస్తే ఈసారి హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాలో భూగర్భ జలాలు కొంతమేరకు పెరగగా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మాత్రం తగ్గాయి. రంగారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తగ్గినప్పటికీ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈసారి 0.10 మీటర్ల భూగర్భజలాలు పైకి వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో కూడా 0.08 మీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ పెరిగింది. గతేడాది అక్టోబర్ లో మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రౌండ్​వాటర్​ 6.67 మీటర్లుండగా, ఈ అక్టోబర్ లో 8.44 మీటర్ల లోతుకు పడిపోయింది. 1.77 మీటర్ల మేర గ్రౌండ్ వాటర్ తగ్గింది. 

హైదరాబాద్​లో 11చోట్ల పెరుగుదల  

 హైదరాబాద్ లోని18 ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్​ను అధికారులు పరిశీలించారు. గతేడాది అక్టోబర్​ లెక్కలతో పోల్చి చూడగా  11 చోట్ల గ్రౌండ్​వాటర్ పెరగ్గా, ఏడు ప్రాంతాల్లో తగ్గింది. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో పెరిగాయి. ఈ జిల్లాలోని శేరిలింగంపల్లిలో గతేడాది 13.90 మీటర్ల లోతులో ఉన్న గ్రౌండ్​వాటర్​ఈసారి అనూహ్యంగా 8.52 మీటర్ల పైకి వచ్చింది. మేడ్చల్​ జిల్లాలో పెరిగింది అల్వాల్​లోనే.. మేడ్చల్–మల్కాజిగిరిలో  15 మండలాలకు ఒక్క చోట మాత్రమే గ్రౌండ్​వాటర్​ పెరిగింది.

అల్వాల్ మండలం మినహా మిగతా 14 మండలాల్లో గ్రౌండ్ వాటర్ తగ్గింది.  కూకట్ పల్లి మండలంలో గతేడాది 7.86 మీటర్ల లో ఉన్న గ్రౌండ్ వాటర్ ఈ ఏడాది ఒక్కసారిగా 14.07 మీటర్లకు పడిపోయింది. కుత్బుల్లాపూర్ మండలంలో లాస్ట్ ఇయర్ 5.25 మీటర్లలో ఉన్న గ్రౌండ్ వాటర్ ప్రస్తుతం 8.69 మీటర్లకు పడిపోయింది.  

మేడ్చల్–మల్కాజిగిరిలో ఎక్కువ వాన పడినా..! 

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ గ్రౌండ్ వాటర్ పెరగలేదు. గతేడాది అక్టోబర్ లో కురిసిన వర్షపాతం 770.1 మిల్లీమీటర్లు కాగా, ఈసారి 2.1 మిల్లీమీటర్లు ఎక్కువగా కురిసి 772.5 మిల్లీమీటర్లు నమోదైంది.  ఈసారి సాధారణ వర్షపాతం 618 మిల్లీమీటర్లు కాగా ఎక్కువగానే పడింది.  అయినా ఈ జిల్లాలో భూగర్భజలాలు పడిపోయాయి. 2022తో పోల్చుకుంటే 2023లో పెరిగినా ఈసారి తగ్గింది. కూకట్ పల్లిలో లాస్ట్ ఇయర్ తో చూస్తే 6.21 మీటర్ల లోతుకు పడిపోయింది.

ఇక్కడ సాధారణ వర్షపాతం 701.4 మిల్లీమీటర్లు కాగా  180.7  మిల్లిమీటర్లు అధికంగా కురిసినా ఫలితం లేకుండా పోయింది. కుత్బుల్లాపూర్ లో 3.44 మీటర్ల గ్రౌండ్ వాటర్ తగ్గింది. ఇక్కడ సాధారణ  వర్షపాతం  704 మిల్లీమీటర్లు కాగా, 844.9 మిల్లిమీటర్లు కురిసినా లాభం లేకుండా పోయింది. అల్వాల్ లో మాత్రం లాస్ట్​ఇయర్​తో పోలిస్తే ఈసారి వర్షపాతం తక్కువగా నమోదైనా ఆశ్చర్యంగా 0.29 మీటర్ల మేర పెరిగింది. ఇక్కడ లాస్ట్ ఇయర్  810.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ సారి 748.8 మిల్లిమీటర్లు మాత్రమే కురిసింది.  

తగ్గడానికి కారణాలివే....

వర్షపాతం ఎక్కువగా నమోదైనా కొన్ని చోట్ల గ్రౌండ్ వాటర్ తగ్గడానికి పలు కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు. కుండపోత వర్షాలు కురిసినప్పుడు భూగర్భంలోకి నీరు వెళ్లకుండా వృథా పోతుందని, అందుకే తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు. ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో  పడిన వర్షపునీరు కూడా భూమిలోకి ఇంకదని చెబుతున్నారు. ముసురు, వాన వచ్చినపుడు నీళ్లు భూమిలోకి ఇంకుతాయని, దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుందంటున్నారు.

నీటి వినియోగం పెరిగినప్పుడు వర్షాలు ఎక్కువ కురిసినా  గ్రౌండ్ వాటర్ తగ్గుతుందంటున్నారు. గ్రేటర్​లో వర్షపు నీరు భూగర్భంలోకి పంపేందుకు సరిపడా ఇంకుడు గుంతలు లేవని ఇది కూడా మేడ్చల్​జిల్లాలో గ్రౌండ్​వాటర్​ తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.

అధిక వర్షపాతం నమోదైనా...

మూడు జిల్లాల్లో ఈ ఏడాది అక్టోబర్ నెలలో అధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం 726.2 మిల్లీమీటర్లు కాగా, 876.8 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే ఇది 150.6 మిల్లీమీటర్లు ఎక్కువ. అయినా కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ పెరగలేదు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సైదాబాద్ లో 3.21 మీటర్ల లోతుకు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఉప్పుగూడలో 2.32 మీటర్లు, కిషన్ బాగ్ లో 2.15 మీటర్ల లోతుకు పడిపోయాయి.

కుల్సుంపురాలో 2.21 మీటర్లు, నాంపల్లిలో 3.01 మీటర్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది.  రంగారెడ్డి జిల్లాలో ఈ  ఏడాది అక్టోబర్​లో సాధారణ వర్షపాతం 632 మిల్లిమీటర్లు నమోదు కాగా, 755.9 మిల్లీమీటర్లు రికార్డయ్యింది. సాధారణ వర్షపాతంతో చూస్తే  123.9 మిల్లిమీటర్లు అధికంగా నమోదైంది. ఈ జిల్లాలో ఎప్పుడూ గ్రౌండ్ వాటర్ పెరగని శేరిలింగంపల్లిలో ఈ సారి ఒక్కసారిగా 5.38 మీటర్ల భూగర్భజలాలు పెరిగాయి. రాజేంద్రనగర్ లోనూ 4.53 మీటర్ల పైకి గ్రౌండ్ వాటర్ వచ్చింది.  మొయినాబాద్ లో లాస్ట్ ఇయర్ తో చూస్తే 1.33 మీటర్ల లోతుకు పడిపోయింది.