కామారెడ్డిలో అడుక్కువెళ్తున్న భూగర్భజలాలు

  • నెల రోజుల వ్యవధిలోనే 1.14 మీటర్ల కిందకు 
  • కామారెడ్డిలో జిల్లాలో 2.20 లక్షల ఎకరాల వరకు వరి సాగు

కామారెడ్డి, వెలుగు: ఎండ కాలం రాకముందే కామారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు లోతుల్లోకి పోతున్నాయి. భూగర్భ జలాల ఆధారంగా పంటలు పండే ఈ జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే నీటిమట్టం 1.14 మీటర్ల కిందకు పడిపోయింది. వానకాలంలో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి భూగర్భజలాలు కూడా పైకి వచ్చాయి. బోర్లలో  నీళ్లు పుష్కలంగా ఉండడంతో యాసంగిలో రైతులు వరి పంటను ఎక్కువగా సాగు చేశారు. కామారెడ్డి జిల్లాలో నవంబర్​లో 5.84 మీటర్ల వరకున్న నీటి మట్టం 7.08 మీటర్లకు పడిపోయింది. ఇంకా ఎండకాలం రాకముందే, వరి నాట్లు కంప్లీట్​ కాకముందే భూగర్భ.లాలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి పంటలకు నీటి వినియోగం పెరగడంతో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. జిల్లాలో లక్షా 20వేలకు పైగా బోర్లు ఉన్నాయి. ఇందులో అగ్రికల్చర్​  కరంటు కనెక్షన్లు అధికారికంగా లక్షా 5వేలు ఉండగా మరో 15 వేల వరకు ఆనధికారిక కనెక్షన్లు ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి,  జుక్కల్​ నియోజక వర్గాల్లోని మెజార్టీ ఏరియాల్లో పంటల సాగుకు భూగర్భజలాలే ప్రధాన ఆధారం. జిల్లా సగటు వర్షపాతం 974.3 మి.మీ. ఉండగా  వానకాలంలో  1280.4  మి.మీ. వర్షపాతం నమోదైంది.  సగటు వర్షపాతం కంటే  306 మి.మీ. వర్షపాతం అధికంగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో భూగర్భజల నీటి మట్టాలు పెరిగాయి.   

అధిక విస్తీర్ణంలో వరి సాగు

యాసంగి సీజన్లో జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతున్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేస్తే ఇందులో 2.20 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు సాగవుతోంది. ఇప్పటికే  2.10లక్షల ఎకరాల్లో వరి నాట్లు కంప్లీట్​ అయ్యాయి. వరికి నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది.

2 మీటర్ల లోతుల్లోకి

నెల రోజుల వ్యవధిలో ఆయా ఏరియాల్లో 1 నుంచి 2 మీటర్ల లోతుల్లోకి నీటి మట్టాలు పడిపోయాయి. ప్రస్తుతం ఆయా ఏరియాల్లో నీటి మట్టాల ఎంత లోతుల్లో ఉన్నాయంటే..దోమకొండ మండలంలో ప్రస్తుతం 10. 28 మీటర్లు, బీబీపేటలో 9.57 మీటర్లు, లింగంపేటలో 8.70 మీటర్లు, రామారెడ్డిలో 8.57 మీటర్లు, గాంధారిలో 8.40 మీటర్లు, పిట్లంలో 7.98 మీటర్లు, ఎల్లారెడ్డిలో 7.71 మీటర్లు, నాగిరెడ్డిపేటలో 7.01 మీటర్లు, నిజాంసాగర్​లో 6.91 మీటర్లు, సదాశివనగర్​లో 6.72 మీటర్లు, బీర్కుర్​లో 6.52 మీటర్లు, కామారెడ్డిలో 6.43 మీటర్లు, మద్నూర్​లో 4.73 మీటర్లు, మాచారెడ్డిలో 4.48 మీటర్లు, పెద్దకొడప్​గల్​లో 4.02 మీటర్లు, రాజంపేటలో 3.98 మీటర్లు, బిచ్కుందలో 2.89 మీటర్లు, నస్రులాబాద్​లో 2.62 మీటర్లు, జుక్కల్​లో 2.56 మీటర్లలో భిక్కనూరులో 2.46 మీటర్లు, తాడ్వాయిలో 2.13 మీటర్ల లోతుల్లో  నీటి మట్టాలు ఉన్నాయి. 

నీటిని ఎక్కువగా వాడుతున్రు

యాసంగి సీజన్​ ప్రారంభమైనందున నీటిని ఎక్కువగా వాడుతున్రు. 2 నెలలుగా క్రమంగా భూగర్భజలాలు కిందకు పడిపోతున్నాయి.   తక్కువ నీటితో పండే పంటల్ని సాగు చేస్తే మేలు. 
–సతీష్​యాదవ్​, జిల్లా గ్రౌండ్​ వాటర్​ ఆఫీసర్​, కామారెడ్డి