- భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి, కంది పంటలు
- ప్రత్యామ్నాయంగా పల్లీ సాగుకు రైతుల మొగ్గు
- ఉమ్మడి జిల్లాలో 3 లక్షలకు పెరగనున్న సాగు
- ఏపీ, కర్నాటక నుంచి విత్తనాలు దిగుమతి
మహబూబ్‌నగర్, వెలుగు:వేరుశనగ సాగు విస్తీర్ణం పెరగనుంది. రాష్ట్రంలో ఈ పంట అత్యధికంగా కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో సాగువుతుండగా.. ఈ సారి డబుల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నిరుడు ఇదే సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 2.41 లక్షల ఎకరాల్లో పంట సాగు కాగా.. ఈ సారి ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి, కంది పంటలు దెబ్బతిని.. రైతులు నష్టపోయారు. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు యాసంగిలో పెద్ద మొత్తంలో పల్లి సాగుకు సిద్ధం అవుతున్నట్లు వ్యవసాయ శాఖ భావిస్తోంది. అయితే డిమాండ్‌కు తగినట్లుగా విత్తనాలు లేకపోవడం, నిరుటి కంటే ఈసారి విత్తన రేట్లు పెరగడంతో రైతులు విత్తనాలను పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు.
3 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా..
ఉమ్మడి పాలమూరు పల్లీ సాగుకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండించే పల్లీకి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. అయితే ఏటా యాసంగిలో వనపర్తి, నాగర్‌కర్నూల్, పాలమూరు, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగయ్యేది. ఈసారి దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పంట సాగవుతుంది. వానాకాలం సీజన్లో ఉమ్మడి జిల్లా రైతులు పెద్ద మొత్తంలో పత్తి పంట వేశారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతినగా, చాలా చోట్ల తెగుళ్లు సోకాయి. పత్తి పూత రాలిపోవడంతో పాటు.. కాయలు కుళ్లిపోయాయి. మొక్కలకు వైరస్ సోకి చచ్చిపోయాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 8.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఇందులో 3 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిని పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో నష్టాలను పూడ్చుకునేందుకు రైతులు ఈ యాసంగిలో పల్లీ సాగుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పంట సాగు లక్షన్నర ఎకరాల నుంచి మూడు లక్షల ఎకరాలకు పెరగనుండగా.. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.24 లక్షల ఎకరాల్లో, వనపర్తిలో 30 వేలు, గద్వాలలో 25 వేలు, పాలమూరులో 20 వేలు, నారాయణపేటలో 60 వేల ఎకరాల్లో పల్లీ సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.
విత్తనానికి పెరిగిన డిమాండ్..
పల్లీ విత్తనానికి డిమాండ్ ఏర్పడింది. గతేడాది క్వింటాల్ విత్తనాలు రూ.11,600 నుంచి రూ.12,100 వరకు పలుకగా.. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.2 వేల వరకు రేట్లు పెరిగాయి. ప్రస్తుతం పాలమూరు మార్కెట్లో మేలు రకం విత్తనాలు క్వింటాల్ ధర రూ.14,200 నుంచి రూ.14,600 వరకు దొరుకుతున్నాయి. రెండో రకం విత్తనాలు 13,100 నుంచి రూ.13,400 వరకు లభిస్తున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో డిమాండ్‌కు తగ్గ విత్తనాలు దొరకడం లేదు. ఇక్కడ దొరుకుతున్న విత్తనాలు నాణ్యతగా కూడా లేవు. దీంతో రైతులు కర్నాటకలోని రాయచూర్, ఏపీలోని అనంతపురం, కర్నూల్ తదితర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలను తెచ్చుకుంటున్నారు. ఇక్కడి రేట్లతో పోలిస్తే అక్కడి రేట్లు క్వింటాల్‌పై రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తక్కువగా ఉన్నాయి.
పెరిగిన పెట్టుబడి..
విత్తన రేట్లు పెరగడంతో పల్లి పంట సాగుకు పెట్టుబడులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎకరా పంట సాగుకు దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడిలో సగం విత్తనాలకే ఖర్చు చేస్తుండగా.. మిగతావి పిండి సంచులు, గుళిక మందులు, కలుపుతీతకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
సీడ్ క్వాలిటీ బాగుంది..
నాకు మూడెకరాల భూమి ఉంది. ఏటా యాసంగిలో పల్లి సాగు చేస్తా. ఈ సారి కూడా మొత్తం పల్లి వేసిన. ఏపీలోని అనంతపురం నుంచి పల్లి విత్తనాలు తెప్పించుకున్నా. సీడ్ క్వాలిటీ బాగుంది. క్వింటాల్ విత్తనాలు రూ.12 వేలకు దొరుకుతున్నాయి.
- రాజు నాయక్, ఎర్రగుంటతండా, మిడ్జిల్
పత్తి లాస్ కావడంతో పల్లి వేసిన..
నాకు ఐదెకరాల భూమి ఉంది. ఇందులో మూడెకరాల్లో పత్తి వేసిన. భారీ వర్షాలకు పంట మొత్తం పోయి లాస్ అయ్యింది. దీంతో మిగతా రెండెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకున్న. మొత్తం పల్లి విత్తనాలు చల్లుకున్నా. క్వింటాల్ విత్తనాలు రూ.14,500కు దొరికాయి.
- ఎండీ హైమద్, అమ్మాపూర్, చిన్నచింతకుంట మండలం