- రూ. 6 వేల లోపే పలుకుతున్న క్వింటాల్ ధర
- పాలమూరు మార్కెట్‌కు పెద్ద మొత్తంలో వచ్చిన పంట
- ధర లేక పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళన
మహబూబ్‌నగర్, వెలుగు:వేరుశనగ రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఏడాది వెదర్ ఎఫెక్ట్ వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడగా.. కొద్దో, గొప్పో చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌కు తీసుకుపోతే వ్యాపారులు నిండా ముంచుతున్నారు. నిరుడి కంటే క్వింటాల్‌పై రూ.1,500 నుంచి రూ.వెయ్యి వరకు రేట్లు తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్ పల్లికి రూ.6 వేలకు మించి ధర చెల్లించడం లేదు.
నిరుడి కంటే తగ్గిన ధర..
మహబూబ్‌నగర్ అగ్రి మార్కెట్‌కు నవాబ్‌పేట, బాలానగర్, మిడ్జిల్, దేవరకద్ర, కోయిల్‌కొండ, హన్వాడ, నారాయణపేట, మక్తల్, దామరదిగ్గ, మాగనూరు, నర్వ, చిన్నచింతకుంట, కర్నాటక రాష్ట్రంలోని యాద్గిర్, సేడం ప్రాంతాల నుంచి రైతులు రెండు రోజులుగా పెద్ద మొత్తంలో పల్లి పంటను తీసుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రేట్లను చూసి ఆందోళన చెందుతున్నారు.
గత సీజన్ మొదట్లో క్వింటాల్ ధర రూ.9 వేల నుంచి ప్రారంభమై.. రూ.8,500, రూ.8 వేల వరకు కొనసాగింది. సీజన్ చివరలో రూ.7,100 వరకు పలికింది. అయితే ఈ సీజన్ మొదట్లోనే రేట్లు పడిపోయాయి. ప్రస్తుతం క్వింటాల్ రేటు అన్ని మార్కెట్లలో రూ.5,800 నుంచి రూ.6,210కి మించి లేదు. మహబూబ్‌నగర్ మార్కెట్లో పల్లికి అత్యధిక ధర రూ.6,210 ఉండగా.. మోడల్ ధర రూ.5,269 పలుకుతోంది.
తగ్గిన దిగుబడి..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది 2.21 లక్షల ఎకరాల్లో రైతులు వేరుశనగ సాగు చేశారు. ఒక మొక్క ఊడకు 18 నుంచి 20 కాయలు ఉండాల్సి ఉండగా, ఐదారు కూడా లేవు. ఎకరాకు 25 సంచుల నుంచి 30 సంచుల వరకు దిగుబడి రావాల్సి ఉండగా.. 12 సంచులకు మించి చేతికి రాలేదు. పంట పూత పట్టి కాయపడుతున్న సమయంలో లో టెంపరేచర్లు నమోదు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. ఊడలకు వైరస్ సోకడం, న్యూట్రియంట్ లోపంతో దిగుబడి తగ్గింది.
ఇదిలాఉంటే ఎకరా పల్లి సాగుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతోంది. విత్తనాల కోసం రూ.14 వేలు, మందు సంచులకు రూ.3 వేలు, దున్నడానికి (మూడు సార్లు) రూ.5 వేలు, కలుపు తీయడానికి రూ.3 వేలు, పంట పీకేటప్పుడు రూ.3 వేలు, మిషన్, ఇతర ఖర్చులు రూ.5 వేల వరకు అవుతున్నాయి. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కింద సంచికి రూ.50 చొప్పున ఎకరాకు రూ.2 వేలు అవుతుంది. ఇలా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఎకరా సాగుకు పెట్టుబడి అవుతోంది. మార్కెట్లలో ఆశించిన ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది.
మా కుటుంబం ఎట్ల బతకాలే?
నాకున్న పది ఎకరాల్లో పల్లి వేసిన. చీడ పీడలు ఆశించి దిగుబడి తగ్గింది. క్వింటాల్ పంటకు రూ.4 వేలు రేటు కడుతున్నారు. నా చేను మూడు కిలోమీటర్లు ఉంది. రోజూ ఇంటి నుంచి చేనుకు పది సార్లు తిరుగుతా. ఆ బండికి పోసిన పెట్రోల్ ఖర్చులు కూడా వచ్చేటట్లు లేవు. ట్రాక్టర్ అద్దె ఎట్ల కట్టాలె? షావుకారికి డబ్బులు ఎట్లియ్యాలే? మా కుటుంబం ఏం తినాలే? మళ్లీ మేం బొంబాయికి వలస పోవాల్నా?- కుమ్మరి రాజు, అల్లికాన్పల్లి, వికారాబాద్ జిల్లా
బందోబస్తు నడుమ కొనుగోళ్లు
అచ్చంపేట/కల్వకుర్తి: వేరుశనగకు వ్యాపారులు సరైన ధర చెల్లించకపోవడంతో రైతులు తిరగబడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌కు పల్లికాయ తెచ్చిన రైతులు అధికారులు, వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట ఏంఎసీ చైర్పర్సన్భర్తపై సోమవారం రైతులు దాడి చేయగా, ఎమ్మెల్యే వంశీకృష్ణ మార్కెట్‌ను సందర్మించి రైతులు, మార్కెట్ సిబ్బందితో మాట్లాడారు. క్వాలిటీకి అనుగుణంగా ధర ఇవ్వాల్సిందేనని వ్యాపారులకు తేల్చిచెప్పారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో పోలీస్ బందోబస్తు మధ్య కాంటా వేశారు.
ALSO READ : వన్యప్రాణులను దత్తత తీసుకున్న మంత్రి
కల్వకుర్తిలో మార్కెట్ సెక్రటరీ ముఖం చాటేయగా, వ్యాపారులు మధ్యాహ్నం 3 గంటల వరకు రాలేదు. కల్వకుర్తి మార్కెట్‌కు సోమవారం 39 మంది రైతులు తెచ్చిన పల్లికాయ కొనకపోవడంతో మొదలైన వివాదం రోడ్డెక్కే వరకు వెళ్ళింది. మంగళవారం 39 మంది రైతుల వేరుశనగకు ధర నిర్ణయించినా వ్యాపారులు ముఖం చాటేశారు. ఇదిలాఉంటే అచ్చంపేట ఏఎంసీ సెక్రటరీపై దాడిని నాగర్ కర్నూల్ టీఎన్జీవోస్ నేతలు ఖండించారు. నల్ల బ్యడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అచ్చంపేట డీఎస్పీని కలిసి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అచ్చంపేటలో డీఎస్పీ శ్రీనువాసులు పోలీసు సిబ్బందితో కలిసి మార్కెట్లో బందోబస్తును పర్య వేక్షించారు.
పాలమూరులో ఆందోళన..
వేరుశనగ పంటకు మద్దతు ధర చెల్లించడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం క్వింటాల్‌కు రూ.6,210 ధర నిర్ణయించగా, మంగళవారం రూ.6,190 ధర చెల్లించాలని నిర్ణయించారు. అయితే వ్యాపారులు దీని కంటే తక్కువ ధరకు రైతుల నుంచి పంటను కొనుగోలు చేశారు. మేలు రకానికి క్వింటాల్ రూ.4,500 నుంచి రూ.5,500 మాత్రమే చెల్లించడంతో ఆగ్రహించిన రైతులు పట్టాలెక్కారు.
క్వింటాల్‌కు రూ.8 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గూడ్స్ రైలును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ట్రాక్ వద్దకు చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో దిగివచ్చిన వ్యాపారులు మరో రూ.200 అదనంగా చెల్లిస్తామని ప్రకటించారు.