- ఎండలు ముదరకముందే తగ్గుతున్న నీటిమట్టం
- కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 10.95 మీటర్లు
- గోజేగావ్లో అత్యధికంగా 3 మీటర్ల లోతుకు నీళ్లు
కామారెడ్డి, వెలుగు: ఎండలు ముదరక ముందే కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జనవరి నెలాఖరులో జిల్లా సగటు నీటి మట్టం 10. 95 మీటర్లు కాగా... పిట్లం మండలం గోజేగావ్లో 3 మీటర్ల లోతుకు చేరింది. ఎండల తీవ్రత ఇంకా పెరగకముందే నీటి మట్టాలు పడిపోతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం యాసంగి ( రబీ ) సీజన్‌లో 3 లక్షల 85 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వరి 2 లక్షల 61 వేల ఎకరాలు ఉంది. లక్షా 80 వేల ఎకరాలకు పైగా వరి బోర్ల కింద సాగు కాగా.. లక్షా 10 వేల బోర్లు ఉన్నాయి. యాసంగిలో సాగు చేసిన వరి పంట కీలక దశలో ఉంది. నీటి వినియోగం ఎక్కువుతున్న దృష్ట్యా భూగర్భజలాలను తోడేస్తున్నారు.
ఆయా చోట్ల ప్రస్తుత నీటి మట్టాలు
నెల రోజుల్లోనే జిల్లాలోని పలు ఏరియాల్లో నీటి మట్టాలు అధిక లోతుల్లోకి వెళ్లాయి. సాగు నీటి ప్రాజెక్టులు లేని ఏరియాలోనే నీటి మట్టాలు అధికంగా పడిపోయాయి. జిల్లా సగటు నీటి మట్టం ప్రస్తుతం 10.95 మీటర్లు ఉంది. 15 నుంచి 2మీటర్ల లోతుల్లో భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, గాంధారి, రాజంపేట మండలాలు ఉన్నాయి. పిట్లం మండలం గోజేగావ్లో 30 మీటర్ల లోతుకు నీళ్లు చేరాయి. ఇక్కడ డిసెంబర్‌లో 28 మీటర్ల లోతుగా ఉండగా నెల రోజుల వ్యవధిలో 2 మీటర్లు కిందకు వెళ్లాయి.
గాంధారి మండలం గుర్జాల్‌లో నెల రోజుల వ్యవధిలో అధికంగా 4 మీటర్లు కిందకు పడిపోయాయి. ఇక్కడ డిసెంబర్‌లో 17 మీటర్లలో ఉంటే ప్రస్తుతం 21.8 మీటర్లకు చేరాయి. రాజంపేట మండలం సిద్దాపూర్‌లో 13.75 మీటర్లు, భిక్కనూరు మండలం మల్లుపల్లిలో 20.19 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి. డిసెంబర్‌లో 16.35 మీటర్లు ఉండగా నెల రోజుల్లో 3.84 మీటర్లు తగ్గాయి. తాడ్వాయి మండలం అన్నారంలో ప్రస్తుతం15.78 మీటర్లు, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్‌లో 15.40 మీటర్లలో నీటి మట్టాలు ఉన్నాయి.
రానున్న రోజుల్లో..
ఇప్పుడిప్పుడే ఎండలు పెరుగుతున్నాయి. భూగర్భజలాల వినియోగం అధికంగా ఉంటుంది. యాసంగి సీజన్‌లో సాగు చేసిన వరి పంటకు రెండు నెలలు నీటి వినియోగం ఎక్కువగా అవసరం. ఇప్పటికే పలు ఏరియాల్లో బోర్లలో నీటి ధారలు తగ్గుతున్నాయి. ఇంకా నీటి వినియోగం పెరిగినట్లయితే భూగర్భ జలాలు మరింత కిందకు వెళ్లే అవకాశముంది.
పొదుపుగా వినియోగిస్తేనే మేలు
నీటిని పొదుపుగా వినియోగించాలి భూగర్భ జలాల కిందకు వెళ్తున్నాయి. ఎండాకాలం కంటే ముందే పలు ఏరియాల్లో అత్యధిక లోతుకు నీటి మట్టాలు పడిపోయాయి. సతీశ్ యాదవ్, జిల్లా భూగర్భ జల అధికారి