యాదాద్రి జిల్లాలో పడిపోతున్న గ్రౌండ్​ వాటర్​.. ఇప్పటికే ఎండిన సగం చెరువులు

యాదాద్రి జిల్లాలో పడిపోతున్న గ్రౌండ్​ వాటర్​.. ఇప్పటికే ఎండిన సగం చెరువులు
  • సంస్థాన్​నారాయణపూర్​ మండలంలో 23.09 మీటర్ల దిగువకు
  • జిల్లాలోని 12 మండలాల్లో పది మీటర్ల దిగువకు భూగర్భ జలాలు
  • పంట ఎండిపోయిన పొలాల్లో పశువులను మేపుతున్న రైతులు
  • మూసీ పరిధిలోనే కొంత మేలు 

యాదాద్రి, వెలుగు : ఈ ఏడాది సీజన్​మొదట్లోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో గ్రౌండ్​వాటర్​ పడిపోతోంది. యాదాద్రి జిల్లాలోని సంస్థాన్​ నారాయణపురంలో 23.09 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయి. గతేడాది సకాలంలో వానలు కురువకపోవడంతో ఇప్పటికే సగం చెరువులు ఎండిపోయాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లోని కొన్ని చెరువుల్లో నీరు ఉంది. మిగిలిన చెరువులు దాదాపు ఎండిపోయాయి. జిల్లాలోని 12 మండలాల్లో పది మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయి. 

తగ్గిన వర్షపాతం..

యాదాద్రి జిల్లాలో సగటుగా సాధారణ వర్షపాతం 738.6 మిల్లీ మీటర్లు. 2020-–21లో 1029.6 మిల్లీ మీటర్ల వాన జూన్​లో కురిసింది. గడిచిన రెండేండ్లలో 2022–-23, 2023–-24లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా (730 మిల్లీ మీటర్లు) కురిసింది. అయితే కురిసిన వానలు కూడా అవసరమైన సమయంలో కాకుండా ఆగస్టు, సెప్టెంబర్​లో కురిశాయి. సకాలంలో కురువని వానల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని వాతావరణశాఖ ఆఫీసర్లు అంటున్నారు. 

నీరు అవసరమయ్యే సమయానికి చెరువులు ఎండిపోతాయని చెబుతున్నారు. వానలు సరిగా కురువకపోవడంతో భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలోని 12 మండలాల్లో పది మీటర్ల దిగువకు భూగర్భ జలాలు ఉండగా, ఆరు మండలాల్లో 4.98 మీటర్ల నుంచి 9.24 మీటర్ల దిగువన ఉన్నాయి. సంస్థాన్​ నారాయణపురంలో 23.09 మీటర్ల దిగువన జలాలు ఉన్నాయి. జిల్లాలో ఏవరేజ్​గా 10.95 మీటర్ల దిగువన భూగర్భ జలాలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గడం వల్ల బోరు బావులు ఆగాగి పోస్తున్నాయి. దీంతో వరికి నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దాదాపు 6 వేల ఎకరాలకు పైగా పంట ఎండిపోయిందని తెలుస్తోంది. పంట ఎండిపోయిన పొలంలో రైతులు పశువులను మేపుతున్నారు. 

జిల్లాలో 500 చెరువులు ఎండిపాయే..

యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 1,165 చెరువులు ఉన్నాయి. వీటిలో వంద ఎకరాల్లోపు సాగుకు నీరు అందించే చిన్న చెరువులే 929 ఉన్నాయి. వంద  ఎకరాలకు మించి 136 చెరువులు మాత్రమే ఉన్నాయి. జిల్లాలో మూసీ తప్ప.. మరో ప్రవాహం లేనందున పంటల సాగు కోసం జిల్లాలోని దాదాపు లక్ష బోరు బావులే ఆధారం. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువుల్లో నీరు చేరితేనే భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు నీరందిస్తే పంటల సాగుకు ఢోకా ఉండదు. 

లేనిపక్షంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. గడిచిన రెండేండ్లలో సకాలంలో వానలు కురువకపోవడంతో ఇప్పటికే దాదాపు చెరువులు ఎండిపోయాయి. 252 చెరువుల్లో 25 నుంచి 50 శాతం నీరుండగా, 175 చెరువుల్లో 50 నుంచి 75 శాతం, 134 చెరువుల్లో 75 నుంచి 100  శాతం నీరు ఉందని లెక్కలు చెబుతున్నాయి. 85 చెరువుల్లో సర్​ప్లస్ వాటర్​ఉందని మైనర్​ ఇరిగేషన్​ఆఫీసర్లు చెబుతున్నారు. 

కొన్ని చెరువుల్లోనే..

జిల్లాలోని భూదాన్​పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట, బీబీనగర్​మండలాల మీదుగా మూసీ  ప్రవాహం ఎక్కువగా కొనసాగుతోంది. భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూర్​(ఎం) మండలాల్లో కొంతమేర మూసీ ప్రవహిస్తోంది. అయితే ప్రవాహం ఎక్కువగా ఉన్న పరిధిలోని మండలాల్లోని చెరువుల్లో మాత్రమే సఫిసియెంట్​గా వాటర్​చేరింది. వలిగొండ, రామన్నపేట, బీబీనగర్​పరిధిలోని 112 చెరువుల్లో 75 శాతం నుంచి సర్​ప్లస్ వాటర్ ఉంది. 

ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో పది చెరువుల్లో నీరు ఉంది. ఇది కూడా ఇటీవల గంధమల్ల చెరువు అలుగుపోయడం వల్ల ఆలేరు వాగు పారింది. ఈ కారణంగా ఆ చెరువుల్లో నీరు చేరింది. అయితే ఆయా మండలాల్లోని చెరువులు అనేకం ఎండిపోయాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండలం పరిధిలోని లక్కారం, దేవలమ్మ నాగారం చెరువులు ఎండిపోగా, అదే మండలంలోని సైదాబాద్ చెరువులో సమృద్ధిగా నీరు ఉంది. నారాయణపురం మండలం పరిధిలోని 79 చెరువులు ఉండగా దాదాపు అన్ని ఎండిపోయాయి.