- అడుగంటుతున్న భూగర్భజలాలు!
- నల్గొండ జిల్లాలోని 24 మండలాల్లో లోతుల్లోకి...
- వేసవి ప్రారంభంలోనే కరువు చాయలు
- గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 0.65 మీటర్ల లోతుల్లోకి చేరిన నీటి మట్టాలు
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో భూగర్భజలాలు అప్పడే అడుగంటుతున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే చాలా ప్రాంతాల్లో కరువు చాయలు కనిపిస్తున్నాయి. భూగర్భజలవనరుల శాఖ నివేదిక ప్రకారం జిల్లాలోని 32 మండలాలకు గాను 24 మండలాల్లో భూగర్భ జలాలు క్రమంగా పడిపోతున్నట్లు తేలింది. గతేడాది ఫ్రిబవరితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే 0.65 మీటర్ల లోతుల్లోకి నీటి మట్టాలు పడిపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 32 మండలా ల్లో 5.47 మీటర్ల లోతుల్లో నీటి మట్టాలు ఉండగా, ఈ ఏడాది అదే రోజుల్లో 6.12 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. జిల్లాలో చివరిసారిగా డిసెంబర్ మొదటి వారంలో వానలు కురవడం ఆగిపోయాయి. గత మూడు నెలల నుంచి వర్షాలు లేకపోవడం, వ్యవసాయ పంటలకు నీటి వినియోగం పెరగడంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతమైన మిర్యాలగూడతోపాటు, ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు పరిధిలోని నల్గొండ డివిజన్ పరిధిలోనే 20 మండలాల్లో నీటి మట్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. మారుమూల గిరిజన ప్రాంతమై న దేవరకొండ డివిజన్ పరిధిలో ఆరు మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఏర్పడింది.
పెరుగుతున్న నీటి వాడకం..
వానాకాలం పంట పొలాలకు నీటి వినియోగం భారీగా పెరిగింది. సాగర్ ఎడమ కాలువ పరిధిలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలతోపాటు, బోరుబావులు, లిఫ్ట్ కెనాల్స్ పరిధిలో నీటి వినియోగం పెరుగుతుందని భూగర్భజల వనరుల శాఖ అధికారులు చెపుతున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఉండటం వల్ల పంటల సాగు విస్తీర్ణం ఏటికేడు పెరిగిపోతుందని, తద్వారా కరెంట్తోపాటు, నీటి వినియోగం కూడా పెరుగుతోందని చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా చింతపల్లి, డిండి, కొండమల్లేపల్లి, నాంపల్లి, నేరేగుగొమ్ము, పీఏపల్లి, అడవి దేవులపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి, త్రిపురారం, వేములపల్లి, చండూరు, కనగల్, కట్టంగూరు, కేతేపల్లి, మునుగోడు, నకిరేకల్, నల్గొండ, నార్కట్పల్లి, శాలిగౌరారం, తిప్పర్తి మండలాల్లో నీటిమట్టం పడిపోతోంది.
పెరిగిన విద్యుత్ వినియోగం...
జిల్లాలో విద్యుత్ వినియోగం కూడా క్రమేపీ పెరుగుతోంది. గడిచిన వారం రోజుల్లో విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే ఫిబ్రవరి 25తేదీన 18.84 మిలియన్ యూనిట్ల విద్యుత్వాడకం జరిగితే ఈనెల 2న 20.18 మిలియన్యూనిట్లకు పెరిగింది. గడిచిన రెండు, మూడు రోజుల్లోనే రోజుకు రెండు మిలియన్యూనిట్ల చొప్పున విద్యుత్వినియోగంపెరుగుతోంది. దీని ప్ర భావం భూగర్భ జలాల పైన తీవ్రంగా పడుతోంది.
మరో మూడు నెలలు ఇదే పరిస్థితి...
వేసవి సీజన్ ముదిరికొద్దే భూగర్భజలాలు మరింత లోతుల్లోకి పోతాయని అధికారులు చెబుతున్నారు. ఎండాకాలంలో పంట పొలాలకు నీటి వాడకం తగ్గినప్పటికీ, వర్షభావ పరిస్థితుల వల్ల తాగునీటి ఎద్దడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మార్చి, ఏప్రిల్, మేలో గడ్డు పరిస్థి తులు ఎదుర్కోక తప్పదని, ఇప్పటి నుంచే నీటి వినియోగంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు కూడా తగ్గుముఖం పడుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. జూన్లో నైరుతి రుతుపవ నాలు ప్రవేశించే వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని చెప్పారు.