
- నెల రోజుల్లో 1.21 మీటర్ల దిగువకు
- జిల్లాలో 10.85 మీటర్ల లోతులో భూగర్భజలాలు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. జనవరిలో భూగర్భ జలాలు 8 మీటర్ల లోతులో ఉంటే ఫిబ్రవరి మొదటి వారం నాటికే జిల్లాలో 10.85 మీటర్లకు తగ్గిపోయాయి. నెలరోజుల వ్యవధిలోనే 1.21 మీటర్ల మేర నీటిమట్టం తగ్గడంతో యాసంగి పంటల సాగుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎండల తీవ్రతతో రానున్న రోజుల్లో వరి పంటకు నీటి లభ్యత సమస్యగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో మొత్తం 3.76 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తుండగా అందులో బోర్లపైనే ఆధారపడి 3.30 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు.
ఎంపిక చేసిన గ్రామాల్లో టెస్ట్ లు
భూగర్భ జల విభాగం ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో రెండు నుంచి మూడు గ్రామాల్లో ప్రతి నెల15 నుంచి 30వ తేదీ వరకు భూగర్భ జలాల మట్టాలను పరీక్షిస్తుంటారు. గత నెలాఖరుకు జిల్లాలోని ములుగులో మండలంలో 29.52, దుబ్బాక మండలం గంభీర్ పూర్ లో 25.12, దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్ లో 24.40, దొమ్మాటలో 20.35, అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలో 20.30, చిట్టాపూర్‌లో 17.89 జగదేవ్ పూర్ మండలం ధర్మారంలో 17.67 మీటర్ల లోతుల్లోకి భూగర్భజలాలు పడిపోయాయి. ముఖ్యంగా హుస్నాబాద్, సిద్దిపేట, చేర్యాల వ్యవసాయ డివిజన్లలో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది.
ALSO READ : మసకబారుతున్న చూపు.. విద్యార్థుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
బోర్లనుంచి నీళ్లు రావడం లేదు
బోర్లపై ఆశతో యాసంగిలో ఆరెకరాల్లో వరిసాగు చేశా. ఇప్పుడే బోరు నుంచి నీళ్లు రావడం లేదు. ఫిబ్రవరి ఆరంభంలోనే బోరు పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత కష్టమయ్యేలా ఉంది. పంట చేతికి వస్తుందో రాదో అన్న భయం వేస్తోంది.
తూముల రామస్వామి , రైతు గుగ్గిళ్ల పెట్టుబడైనా వస్తుందో రాదో
యాసంగిలో మూడెకరాల్లో వరి పంట వేశాను. రూ. 30 వేల వరకు ఖర్చు చేశారు. బోరు బావి నుంచి నీరు సరిగా రావడం లేదు. దీంతో మోయ తుమ్మెద వాగులో వావి పూడిక తీసి మోటారుతో పంటలకు నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. పెట్టుబడి ఖర్చులు అయినా వస్తాయో రావో అని అనిపిస్తుంది.- రైతు పొన్నాల శంకర్, గాగిల్లాపూర్