వెబ్ సైట్​లో గ్రూప్ 1 హాల్ టికెట్లు

వెబ్ సైట్​లో గ్రూప్ 1 హాల్ టికెట్లు

హైదరాబాద్, వెలుగు : ఈ నెల16న జరగనున్న గ్రూప్1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది.  టీఎస్​పీఎస్సీ ఐడీ, డేటాఫ్​ బర్త్ తో tspsc.gov.in  వెబ్ సైట్​ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ సెక్రటరీ  అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.  ఓఎంఆర్​ షీట్​లో ఇది వరకు బుక్​లెట్​ సిరీస్​ ఏ, బీ, సీ, డీ గా ఉండేదని, దాన్ని నంబర్లలోకి మార్చామని ఆమె చెప్పారు.

హాల్​టికెట్లను వెబ్ సైట్​లో పెట్టిన రెండు గంటల్లోనే 70 వేల మందికి పైగా డౌన్​లోడ్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 503 గ్రూప్ 1 పోస్టుల కోసం 3,80,202 మంది పోటీపడుతున్నారు. అభ్యర్థులకోసం 33 జిల్లాల్లో 1,041 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే ఆదివారం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని  అధికారులు ప్రకటించారు. మరోపక్క గ్రూప్​1 పరీక్ష నిర్వహణ, సెంటర్లలో సౌకర్యాలపై టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్​రెడ్డి కలెక్టర్లతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ప్రతి సెంటర్​లో సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్ పరికరాలను ఏర్పాటు చేశారు.