అత్యంత పకడ్బందీగా గ్రూప్​1 మెయిన్స్

అత్యంత పకడ్బందీగా గ్రూప్​1 మెయిన్స్
  • టీజీపీఎస్సీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి
  • అధికారులకు హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్ల దిశానిర్దేశం

హైదరాబాద్ సిటీ/ఇబ్రహీంపట్నం, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత ప్రాముఖ్యతతో పకడ్బందీగా నిర్వహించాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి,శశాంక ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఆయా కలెక్టరేట్లలో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో అధికారులకు వారు దిశానిర్దేశం చేశారు. 

అక్టోబర్21 నుంచి 27 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. 1.30 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించరని స్పష్టం చేశారు. హైదరాబాద్​జిల్లాలోని 8 ఎగ్జామ్ సెంటర్లలో 5,613 అభ్యర్థులు, రంగారెడ్డి జిల్లాలో రెండు రూట్లలోని 11 ఎగ్జామ్ సెంటర్లలో 8,008 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు.

 సెల్ ఫోన్, చేతి గడియారాలు, డిజిటల్ పరికరాలకు అనుమతి లేదని, టీజీపీఎస్సీ మార్గదర్శకాలను అభ్యర్థులు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు, నాల్గో తరగతి సిబ్బంది సహా ఎవరూ ఫోన్ వినియోగించరాదని సూచించారు. అభ్యర్థులకు ట్రాఫిక్​ఇబ్బందులు కలగకుండా, ఆయా రూట్​లలో ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలను పరీక్షించాలని చీఫ్ సూపరింటెండెంట్ లను ఆదేశించారు.