
- 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్
- 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు
- 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల జీఆర్ఎల్.. టీజీపీఎస్సీ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్స్ ఎగ్జామ్స్ తో పాటు పలు పోటీ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. శుక్రవారం టీజీపీఎస్సీ కమిటీ సమావేశం కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పలు పరీక్షల ఫలితాలపై చర్చించారు. అనంతరం ఐదు పరీక్షలకు సంబంధించిన ఫలితాల విడుదల తేదీలను ప్రకటించారు.
గ్రూప్1 మెయిన్స్ ఫలితాలు ఈ నెల10న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అభ్యర్థికి వచ్చిన ప్రొవిజినల్ మార్కుల జాబితాను వెల్లడించనున్నారు. అలాగే, ఈ నెల11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను విడుదల చేస్తారు. ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ జీఆర్ఎల్ను 19న విడుదల చేయనున్నట్టు చైర్మన్ తెలిపారు. స్టేట్లో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2024 జూన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా.. 3.02 లక్షల మంది హాజరయ్యారు. అందులో 1:50 రేషియాలో మెయిన్స్ కు 31,403 మందిని ఎంపిక చేస్తే.. 21,093 మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయ్యారు.
వీరందరికీ వచ్చిన మార్కులను ఈ నెల 10న టీజీపీఎస్సీ రిలీజ్ చేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2024 డిసెంబర్ 15,16 తేదీల్లో జరిగిన పరీక్షలకు 5.51 లక్షల మందికి గాను 2.51 లక్షల మంది మాత్రమే అటెండ్ అయ్యారు. ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాకింగ్ లిస్టు(జీఆర్ఎల్)లను కమిషన్ ఈ నెల 11న విడుదల చేయనున్నది. 1,363 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గతేడాది జరిగిన పరీక్షలకు 5.36 లక్షల మందికి గాను 2.69 లక్షల మంది హాజరయ్యారు.
వీరందరి జీఆర్ఎస్ డేటాను టీజీపీఎస్సీ ఈ నెల 14న రిలీజ్ చేయనుంది. వీటితో పాటు వివిధ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(వార్డెన్) పోస్టులకు సంబంధించి 1:1 ఫలితాలు ఈ నెల17న రిలీజ్ కానున్నాయి.
తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: బుర్రా వెంకటేశం
గ్రూప్1 తో పాటు ఇతర పరీక్షలకు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మొద్దని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సూచించారు. నిబంధనల ప్రకారమే రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైన మధ్యవర్తులు సంప్రదిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. కమిషన్ సిబ్బంది, అధికారులు తమకు సహాయం చేస్తారని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే.. వారిపై ఆధారాలతో ఫిర్యాదు చేయాలన్నారు.
ఆ సమాచారాన్ని కమిషన్ కుతెలపాలనుకుంటే విజిలెన్స్ నంబర్ 9966700339 కు గానీ, vigilance@tspsc.gov.in మెయిల్ కు గానీ ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. టీజీపీఎస్సీకి ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. కమిషన్ ను అప్రతిష్టపాలు చేసేందుకు, నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేసే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామని చైర్మన్ హెచ్చరించారు.