న్యూఢిల్లీ, వెలుగు: ఉద్యోగ నియామక పరీక్షలలో కోర్టుల జోక్యం అనవసరమని, కోర్టులు కల్పించుకుంటే నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈమేరకు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఇది దాదాపు 30 వేల మంది అభ్యర్థులపై ప్రభావం చూపే పిటిషన్ అని, పిటిషన్ దారులు ఏడుగురిలో ఒక్కరు కూడా మెయిన్స్‌కు అర్హత సాధించలేదని గుర్తుచేస్తూ ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
కొత్త ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్
2022 లో గ్రూప్–1 కు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, పలు కారణాలతో ఒకసారి ప్రిలిమ్స్‌ను ప్రభుత్వం రద్దు చేయగా, బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం కొలువు దీరడం జరిగింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు పాత నోటిఫికేషన్ ను పక్కన పెట్టి, పోస్టులు పెంచి మళ్లీ కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులకు అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికే ప్రక్రియను పరిమితం చేయాలని కోరారు. ప్రిలిమ్స్ కీలో తప్పు సమాధానాల కారణంగా జూన్‌లో జరిగిన ప్రిలిమ్స్‌ను పక్క పెట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. చాలా ఆలస్యంగా పిటిషన్ దాఖలు చేశారని, ప్రిలిమ్స్ కీ లోని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాకే తుది కీ రూపొందించారని చెబుతూ పిటిషన్‌ను అక్టోబర్‌లో కొట్టివేసింది.
సుప్రీంను ఆశ్రయించిన అభ్యర్థులు
దీనిని సవాల్ చేస్తూ దామోదర్ రెడ్డి గంగుల, సత్త శేఖర్, పలువురు అభ్యర్థులు గత నెల నవంబర్ 18 న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం ముందుకు వచ్చింది. టీజీపీఎస్సీ తరపున సీనియర్ అడ్వొకేట్ నిరంజన్ రెడ్డి, గౌరవ్ అగర్వాల్ లు, పిటిషనర్ల తరపు సీనియర్ అడ్వొకేట్ ఎస్ గురు కృష్ణ కుమార్ వాదనలు వినిపించారు. గురు కృష్ణకుమార్ వాదిస్తూ... కొత్త ప్రభుత్వం ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్ కీలో 14 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని తెలిపారు. ఎగ్జామ్ తేదిని రెండు రోజులు పెంచారని తెలిపారు.
దీనిపై వేసిన ఎక్స్ పర్ట్స్ కమిటీ రిపోర్ట్ కూడా తప్పుగా ఉందని బెంచ్‌కు నివేదించారు. అందువల్ల ప్రిలిమ్స్‌పై ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్స్ కమిటీ వేసి, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు మెయిన్స్‌ను వాయిదా వేయాలని, గ్రూప్ – 1 నోటిఫికేషన్ రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. గ్రూప్ – 1 నోటిఫికేషన్ ను రద్దు చేయడం కుదరదని స్పష్టంచేసింది. నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 29పై తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేసింది. హైకోర్టు ఆదేశాల మేరకే గ్రూప్ – 1 పోస్ట్ ల ఎంపిక ఉంటుందని తేల్చి చెప్పింది.