విశ్లేషణ: ప్రిలిమ్స్​లోనే రిజర్వేషన్లా?

సుమారు పుష్కర కాలం నిరీక్షణ తర్వాత తెలంగాణాలో వెలువడిన గ్రూప్1 నోటిఫికేషన్ ను ఆది నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. జనవరిలో విడుదలైన గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల మీద వివాదం రాజుకుంటున్నది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ద్వారా ఎంపిక చేసి రూపొందించిన మెయిన్స్ అర్హత జాబితాపై పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. నోటిఫికేషన్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు తెచ్చిన జీ.ఓ.నెం.55 ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నది. గతంలో వెలువడ్డ అన్ని గ్రూప్1 నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్లకు అతీతంగా1:50 నిష్పత్తి చొప్పున మెయిన్స్ కు అర్హుల జాబితా రూపొందించేవారు. కానీ ఇప్పుడు వెలువడ్డ నోటిఫికేషన్ లో అందుకు భిన్నంగా రిజర్వేషన్ల వారీగా మెయిన్స్ అర్హత జాబితా రూపొందించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని పలు కేసుల్లో కోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. 

కోర్టు తీర్పులకు వ్యతిరేకం

ప్రభుత్వ తప్పిదంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ప్రిలిమ్స్ స్థాయిలోనే అన్ని రకాల రిజర్వేషన్లను అమలు చేయడం వల్ల అన్ని సామాజిక వర్గాల వారికి నష్టం జరిగింది. మహిళా కోటాను హైకోర్టు తీర్పు మేరకు సమాంతరంగా అమలు చేస్తామని చెప్పినా, బ్రేక్ అప్ లిస్ట్ ఇవ్వకుండా పాత రోస్టర్ పాయింట్ల ఆధారంగా జాబితా రూపొందించడం సరికాదనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. బాలోజీ బదావత్ కేసులో, జాఫర్ సాహెబ్ కేసులోనూ ప్రిలిమినరీ స్థాయిలో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని కోర్టులు విస్పష్టంగా తీర్పులు ఇచ్చాయి. ఎంపిక సమయంలో ప్రతిభతో పాటు సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ సామాజిక న్యాయం పేరిట తొలిదశలోనే ప్రతిభావంతులను నిలువరించడం సరికాదని, అది ప్రాథమిక హక్కు16(4)కు విరుద్ధమని పలు సందర్భాల్లో కోర్టులు వ్యాఖ్యానించాయి.

గత అనుభవాలను గమనించి..

ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు దీర్ఘంగా ఉండటం, వాటిని చదవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, చాలావరకు ప్రశ్నలు ప్రవచనాల రూపంలో సివిల్స్ స్థాయిని మించి ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దాని వల్ల అభ్యర్థులందరూ సుమారు 30 నుంచి 35 ప్రశ్నలు చదవకుండానే జవాబులు పెట్టారు. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష సివిల్స్ పరీక్షతో సమానమైన స్థాయిలో ఉన్నప్పటికీ, సివిల్స్ పరీక్షలో ఇచ్చిన సమయం కంటే తక్కువ సమయాన్ని ఇవ్వడంతో పాటు నెగెటివ్ మార్కు లేకపోవడం వల్ల అదృష్టవంతులకు అవకాశం వచ్చిందని పలువురు ఆశావహులు వాపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం పలు సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఆధారంగా తీసుకొని మధ్యేమార్గంగా జీ.ఓ.55 ను సవరించడంతో పాటు అవసరమైతే నిష్పత్తిని పెంచి ఆశావహులకు అవకాశాలు ఎక్కువ సంఖ్యలో కల్పించడం ద్వారా ఈ ప్రక్రియను వివాదాల సుడిగుండం నుంచి గట్టెక్కించవచ్చు.

తగ్గుతున్న అవకాశాలు

మల్టీజోన్ల వారీగా మెయిన్స్ అర్హుల జాబితాను ఎంపిక చేశారు. ప్రిలిమినరీ స్థాయిలోనే రిజర్వేషన్లను అమలు చేయడం వల్ల అన్ని సామాజిక వర్గాల అభ్యర్థుల అవకాశాలు మునుపటితో పోలిస్తే సన్నగిల్లాయి. ఉదాహరణకు మల్టీ జోన్ 2 లో ‘బీసీ డి’ జనరల్ అభ్యర్థి ఓపెన్ కోటాలో 68 పోస్టులకు, ‘బీసీ డి’లోని 4 పోస్టులకు సంబంధించి మాత్రమే1:50 నిష్పత్తిలో అవకాశం ఉంటుంది. అంటే ఓపెన్ లో 3,400, ‘బీసీ డి’లో 200 మందిలో మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ మల్టీ జోన్ 2లోని మొత్తం 268 పోస్టులకు అనుగుణంగా1:50నిష్పత్తిలో చూస్తే ఆ అభ్యర్థికి13,400 మందిలో అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ స్థాయిలోనే రిజర్వేషన్లను పాటించడం వల్ల అవకాశాలు ఇలా సన్నగిల్లాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
- సి. సాకేత ప్రవీణ్