- రెండు డిపార్ట్మెంట్ల జీవోల కోసమే టీఎస్ పీఎస్సీ వెయిటింగ్
- అవసరమైతే ఆ పోస్టులను తీసేసేందుకు యోచన
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 నోటిఫికేషన్ రిలీజ్‌కు టీఎస్ పీఎస్సీ సిద్ధమైంది. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఈ సారి గ్రూప్1 పోస్టుల సెలెక్షన్ ప్రాసెస్ అంతా మల్టీజోన్ విధానంలోనే నిర్వహించేందుకు అంతా రెడీ అయింది. రెండు, మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశమున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. మరో రెండు డిపార్ట్ మెంట్లలో కొత్త పోస్టులకు సంబంధించి రావాల్సిన జీవోల కోసమే ప్రస్తుతం వెయిట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. గ్రూప్ 1 కింద 19 కేటగిరీలకు చెందిన 503 పోస్టులను భర్తీ చేస్తామని సర్కారు ఇదివరకే ప్రకటించింది. రాష్ట్రంలో ఇదే తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ కావడంతో దీనిని సీరియస్ గా తీసుకుంది. అయితే సీఎం ప్రకటన తర్వాత వారం, పది రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని అనుకున్నా, పలు డిపార్ట్మెంట్ల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ఆలస్యమవుతోంది.
మల్టీజోన్‌ల వారీగానే ‘గ్రూప్1’
ఈ సారి కొత్తగా గ్రూప్ 1 కేటగిరీలో మైనార్టీ శాఖలో జిల్లా మైనార్టీస్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులతో పాటు పోలీస్ శాఖలోని డీఎస్పీ కేటగిరీలోని కొన్ని పోస్టులను క్రియేట్ చేశారు. వీటికి ఆయా డిపార్ట్మెంట్ల నుంచి గుర్తింపు ఇస్తూ అఫిషియల్ జీవోలు రావాల్సి ఉంది. అవి పెండింగ్‌లోనే ఉండటంతో నోటిఫికేషన్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ రెండు కేటగిరీల పోస్టుల భర్తీకి ఏమైనా న్యాయపరమైన చిక్కులున్నాయా? అనే విషయంపై సర్కారు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంటే, ఈ పోస్టులను గ్రూప్ 1 నుంచి తొలగించి, మిగిలిన పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశమూ ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రిలిమ్స్
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ నెలలో నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అప్లికేషన్ల ప్రక్రియకు నెలరోజుల టైమ్ ఇచ్చి, ప్రిపరేషన్‌కు మరో మూడు నెలల గడువు ఇవ్వాలని యోచిస్తున్నారు. తెలంగాణలో తొలిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తుండటంతో దీనికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేట్ కేడర్ పోస్టులు రద్దు కావడంతో మల్టీజోన్ పోస్టులుగా గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు మల్టీజోన్ల వారీగా పోస్టులను ఇప్పటికే విభజించి, ప్రతిపాదనలు రెడీ చేశారు. మరోపక్క పలు పోస్టులకు క్వాలిఫికేషన్లనూ మార్చారు. ఆర్టీఓ పోస్టులకు ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిగ్రీని తప్పనిసరి చేసినట్టు తెలిసింది.