పరీక్షకు 13 రోజుల ముందే గ్రూప్ 1 పేపర్ లీక్‌‌?

  • అక్టోబర్​ మొదటి వారంలో పేపర్​హ్యాక్​
  • ప్రవీణ్​నుంచి ఏఎస్ఓ షమీంకు ప్రశ్నపత్రం
  • ఆపై రాజశేఖర్​ నుంచి రమేశ్,ప్రశాంత్ రెడ్డికి
  • 10రోజుల ముందు నుంచే నిందితుల ప్రిపరేషన్​
  • టీఎస్​పీఎస్సీ ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్న సిట్​

గ్రూప్​1పేపర్​ లీకేజీ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్​,రాజశేఖర్​ను ఇప్పటికే 9 రోజులుపాటు సిట్​విచారించింది.ప్రవీణ్​తన కోసమే పేపర్​దొంగిలించినట్లు సిట్​అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే సిట్​ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకివచ్చాయి. అక్టోబర్​మొదటి వారంలోనే ప్రవీణ్​,రాజశేఖర్​ రెడ్డి పేపర్​హ్యాక్​చేసినట్లు తెలిసింది.

ఆనెల 16న జరిగిన ప్రిలిమ్స్‌‌కి 10 రోజుల ముందు నుంచే నిందితులు ప్రిపేర్  అయ్యారని సమాచారం. పేపర్‌‌‌‌ లీకేజీ గురించి అసిస్టెంట్‌‌ సెక్షన్  ఆఫీసర్‌‌‌‌ షమీం, డేటా ఎంట్రీ ఆపరేటర్  దామెర రమేశ్ కు కూడా ముందుగానే తెలుసని సిట్‌‌  గుర్తించింది. ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో  జనగామ జిల్లా పోతారం గ్రామానికి చెందిన నలగొప్పుల సురేశ్ కు, న్యూజిలాండ్‌‌లో ఉన్న రాజశేఖర్‌‌  ‌‌రెడ్డి బావ ప్రశాంత్‌‌  రెడ్డికి పేపర్ చేరిందని సిట్‌‌  అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.

పది రోజుల ముందుగానే పేపర్‌‌‌‌  లీక్‌‌  కావడంతో షమీం, రమేశ్  ద్వారా టీఎస్‌‌ పీఎస్సీ స్టాఫ్‌‌లో  మరి కొంతమందికి లీకేజీ గురించి తెలిసిందని అధికారులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే షమీం, రమేశ్, సురేశ్ ను ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఆ ముగ్గురిని బుధవారం ఉదయం చంచల్‌‌గూడ జైలు నుంచి హిమాయత్‌‌  నగర్‌‌‌‌లోని సిట్ ఆఫీసుకు తరలించారు. మొదటి రోజు విచారణలో వారి వ్యక్తిగత వివరాలు, టీఎస్‌‌ పీఎస్సీలో వారు నిర్వహించే విధులకు సంబంధించిన సమాచారంతో స్టేట్‌‌మెంట్‌‌  తీసుకున్నారు. గ్రూప్‌‌1 పేపర్‌‌  లీకేజీ విషయం కమిషన్ లో ఇంకా ఎంత మందికి తెలుసని ప్రశ్నించినట్లు తెలిసింది.

ఆఫీస్ కాంటాక్టులపై సిట్ అనుమానాలు

టీఎస్‌‌ పీఎస్సీలో సుమారు 165 మందిలో 82 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాగా మరో 83 మంది ఔట్‌‌సోర్సింగ్‌‌  కింద పనిచేస్తున్నారు. రెగ్యులర్,  ఔట్ సోర్సింగ్  ఉద్యోగులు మొత్తం 26 మంది గ్రూప్‌‌ 1 ప్రిలిమ్స్‌‌ రాశారు. సెక్రటరీ పీఏ ప్రవీణ్‌‌, అసిస్టెంట్‌‌  సెక్షన్‌‌  ఆఫీసర్‌‌‌‌ షమీం, డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌‌‌  రమేశ్​ సహా మొత్తం 8 మందికి100కు పైగా మార్కులు వచ్చాయి. షమీం అసిస్టెంట్‌‌ సెక్షన్ ఆఫీసర్, దామెర రమేశ్​  డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌ కావడంతో  ఆఫీసులోని ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్నాయని సిట్ అనుమానిస్తున్నది. కాన్ఫిడెన్షియల్  సెక్షన్ ఆఫీసర్‌‌‌‌  శంకర లక్ష్మి సిస్టమ్‌‌  నుంచి పేపర్​ను ప్రవీణ్, రాజశేఖర్  దొంగిలించారన్న విషయం షమీం, రమేశ్​కు ముందుగానే తెలిసిందని సిట్ గుర్తించింది. అయితే షమీం, రమేశ్​ ద్వారా ఇంకా ఎంతమందికి పేపర్  చేరిందనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. సురేశ్​కు పేపర్  ఎవరు షేర్  చేశారు, అతని వద్ద డబ్బులు తీసుకున్నారా అనే వివరాలను సేకరిస్తున్నారు.

ఏఈ పేపర్‌‌‌‌ నిందితులను కస్టడీ కోరిన సిట్‌‌

మరోవైపు ఏఈ పేపర్  లీకేజీ కేసులో సిట్  అధికారులు వివరాలు రాబడుతున్నారు. గ్రూప్‌‌ 1 తరువాత అసిస్టెంట్‌‌ ఇంజినీర్‌‌‌‌  పేపర్‌‌‌‌ ఎంత మందికి చేరిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరీక్ష రాసిన ప్రశాంత్‌‌ రెడ్డి, రాజేంద్ర కుమార్‌‌‌‌  మీడియేటర్‌‌‌‌  తిరుపతయ్యను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్  వేశారు. ఈ పిటిషన్‌‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.