
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం అయ్యింది. 2024, జూన్ 9వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పరీక్ష.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగనుంది. మొత్తం 563 గ్రూప్ వన్ పోస్టుల కోసం ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు అధికారులు. ఎగ్జామ్ కి సంబంధించి ఇప్పటికే పకడ్బంది ఏర్పాట్లు చేసింది టీజీపీఎస్సీ. 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది కమిషన్.
మొత్తం 4లక్షల 3 వేల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాయనున్నట్లు తెలిపారు అధికారులు. ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని, ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించమని అధికారులు చెప్పడంతో.. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాల దగ్గరికి అభ్యర్థులు చేరుకున్నారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలు వంటి కారణాలతో గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దైన సంగతి తెలిసిందే. ఈసారి అలాంటి తప్పులకు తావు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది TGPSC. పరీక్షలో విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కమిషన్.మరోవైపు గ్రూప్ వన్ పరీక్ష కోసం TGSRTC స్పెషల్ బస్సులు నడుపుతోంది. అభ్యర్థుల కోసం సర్వీసులు పెంచుతోంది RTC. 897 పరీక్షా కేంద్రాలకు బస్సులు నడపాలని నిర్ణయించింది.