- మహిళా రిజర్వేషన్లపై క్లారిటీ వస్తేనే ఇచ్చే చాన్స్
- హారిజంటల్ విధానమే వర్తింపజేయాలన్న హైకోర్టు
- వర్టికల్ విధానంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్‌పై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. మహిళా రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అందరిలో ఆందోళన మొదలైంది. వర్టికల్ విధానంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, హారిజంటల్ విధానమే అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలిచ్చి నెలన్నర గడిచినా, ఇప్పటికీ రాష్ట్ర సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
మరోపక్క కోర్టు తుది తీర్పు తర్వాతే ముందుకు పోయే యోచనలో టీఎస్ పీఎస్సీ ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆ తీర్పు వచ్చే వరకు ప్రిలిమ్స్ రిజల్ట్ ప్రకటించే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్రంలో 503 గ్రూప్1 పోస్టుల భర్తీకి ఏప్రిల్ నెలాఖరులో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వర్టికల్ విధానంలో రిజర్వేషన్లు అమలు చేసి.. జనరల్ కేటగిరీలో 278 పోస్టులు, ఉమెన్స్ కేటగిరీలో 225 పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించింది.
అయితే మహిళలకు ప్రత్యేకంగా 33% రిజర్వేషన్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో తాము నష్టపోతామని కొడెపాక రోహిత్, డి.బాలకృష్ణ అనే ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు హారిజంటల్ (పాత విధానం) విధానమే అమలు చేయాలని సెప్టెంబర్ నెలాఖరులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
రిజర్వేషన్ల కేటగిరీల్లోనే కాకుండా జనరల్ కోటాతో కలిపి మొత్తంగా 33 శాతం మంది మహిళలను ఉద్యోగాల్లో నియమించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 1కి వాయిదా వేసింది. అయితే ఇప్పటికీ ఆ కేసు హైకోర్టు హియరింగ్ లిస్టులోకి రాలేదని అధికారులు చెబుతున్నారు.
అయితే లిస్టులో చేర్చే పనిని అధికారులు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను అక్టోబర్16న నిర్వహించారు. దీనికి 3,80,082 మంది దరఖాస్తు కోగా.. 2,86,021 మంది హాజరయ్యారు. అదే నెల 29న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేశారు. ఈ నెల 4 వరకు ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరించారు. 10 రోజుల్లో ఫైనల్ కీ ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
మెయిన్స్‌కు ఎంపిక ఎట్ల?
ఇంకో వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కానీ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారా? లేదా? అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో ఒక్కో కేటగిరీలో ఒక్కో పోస్టుకు 1:50 ప్రకారం అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయాల్సి ఉంది. కానీ మహిళా రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఎలా ఎంపిక చేస్తారనే ఆందోళన మొదలైంది.
వర్టికల్ పద్ధతిలో నోటిఫికేషన్ ఇవ్వగా, హైకోర్టు మాత్రం హారిజాంటల్ప్రకారమే ముందుకు పోవాలని సూచించింది. ఒకవేళ కోర్టు ఆదేశాలతో హరిజాంటల్ ప్రకారం ముందుకు పోవాలంటే మళ్లీ అన్ని పోస్టులకూ రిజర్వేషన్లను మార్చాల్సి ఉంటుంది. ఈ లెక్కన మహిళలకు పలు కేటగిరీల్లో పోస్టులు తగ్గుతాయి. కానీ ఇప్పటికీ అధికారులు ఆ ప్రక్రియ మొదలుపెట్టలేదు. హైకోర్టు తుది తీర్పు ప్రకారమే ముందుకు పోతామని అధికారులు అంటున్నారు. మరోపక్క హైకోర్టుకు రిజర్వేషన్లపై పూర్తి రిపోర్టు ఇచ్చారా? లేదా? అనే విషయంపైనా క్లారిటీ లేదు. దీంతో హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
అభ్యర్థుల్లో ఆందోళన...
గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ టఫ్ గా రావడంతో క్వాలిఫై అవుతామో? లేదో? అనే ఆందోళన అభ్యర్థుల్లో ఉంది. దీంతో మెయిన్స్‌కు చాలామంది ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాతే ప్రిపరేషన్మొదలుపెట్టాలని భావిస్తున్నారు. మరోపక్క మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో పెడ్తామని టీఎస్ పీఎస్సీ గతంలోనే ప్రకటించింది. దీంతో రిజల్ట్ ఆలస్యమైతే ప్రిపరేషన్‌కు టైమ్ తగ్గే అవకాశముందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే కోర్టు కేసులు క్లియర్ చేసి, ఫలితాలు రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.