
- ఓసీలు 36.4%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6%
- సబ్జెక్టులవారీగా టాప్ మార్కులు వెల్లడి
- రోస్టర్ ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తాం
- తప్పుడు ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు సూచన
హైదరాబాద్,వెలుగు: ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ –1 మెయిన్స్ ఫలితాల సమగ్ర డేటాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. సబ్జెక్టులవారీగా టాప్ మార్కులు, కులాలవారీగా టాపర్ల సంఖ్యను ప్రకటించింది. టాప్ –500 ర్యాంకర్లలో 45.6% మంది బీసీలు ఉండగా, 36.4% మంది ఓసీలు ఉన్నట్టు వెల్లడించింది.
ఎస్సీలు 10 శాతం, ఎస్టీలు 7.6 శాతం మంది ఉన్నట్టు తెలిపింది. అయితే, కొందరు గ్రూప్ –1 ఫలితాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో గందరగోళం ఉండొద్దనే ఉద్దేశంతో వివరాలు వెల్లడిస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రతి ఆన్సర్ షీట్‌ను ఇద్దరు వేర్వేరు ఎవాల్యుయేటర్లు 2 సార్లు మూల్యాంకనం చేశారని తెలిపింది.
- గ్రూప్ –1 మెయిన్స్ లో మొత్తం 20,161 మందికి సంబంధించిన మార్కులను టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించింది. దీంట్లో టాప్ –500 ర్యాంకులు పొందిన వారిలో పురుష అభ్యర్థులు 296 మంది ఉండగా, మహిళా అభ్యర్థులు 204 మంది ఉన్నారు. దీంట్లో బీసీలు 228 మంది, ఓసీలు 184 (ఈడబ్ల్యూఎస్‌తో కలిపి) మంది, ఎస్సీలు 50 మంది, ఎస్టీలు 38 మంది ఉన్నారు.
- టాప్ –100 ర్యాంకర్లలో 59 మంది పురుష అభ్యర్థులు ఉండగా, 41 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇందులో బీసీలు 48 మంది, ఓసీలు 44 (ఈడబ్ల్యూఎస్ 12 కలిపి) మంది, ఎస్సీలు ముగ్గురు, ఎస్టీలు ఐదుగురు ఉన్నారు.
- మార్కులు ప్రకటించిన వారిలో ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు 12,323 మంది, తెలుగు మీడియం 7,829, ఉర్దూ మీడియం అభ్యర్థులు 9 మంది ఉన్నారు.
- క్వాలిఫై పేపర్ ఇంగ్లిష్ లో 150 మార్కులకు గానూ అత్యధికంగా 139.5 మార్కులు వచ్చాయి. పేపర్–1లో 97.5, పేపర్– 2లో 102.5, పేపర్ –3లో 102.5, పేపర్–4 లో 113.5, పేపర్ –5లో 96.5, పేపర్ –6లో 96.5 మార్కులు వచ్చాయి.
ఎవాల్యుయేషన్ చేసేందుకు సబ్జెక్ట్ ఎక్స్ పర్టులు, సీనియర్ ప్రొఫెసర్లను నియమించినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. ఇంగ్లిష్ సబ్జెక్టుకు 33 మంది, పేపర్ 1 జనరల్ ఎస్సేకు 57 , హిస్టరీ అండ్ కల్చర్ కు 26, జాగ్రఫీ 22, ఇండియన్ సొసైటీ 22, రాజ్యాంగం 25, గవర్నెన్స్ 23, ఎకనామిక్స్ అండ్ డెవలప్ మెంట్ సబ్జెక్ట్ 38, సైన్స్ అండ్ టెక్నాలజీ 21, బయోటెక్నాలజీ 26, డేటా ఇంటర్ ప్రిటేషన్18 మంది, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుకు 40 మంది ఎవాల్యుయేటర్లను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది.