
ఇటీవల తెలంగాణ ఆర్థిక శాఖ గ్రూప్2, గ్రూప్3 పోస్టులకు అనుమతి ఇవ్వడంతో త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండింటిలో ఉన్న కామన్ సిలబస్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం..
గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్–2, గ్రూప్–3 సిలబస్‌లోని దాదాపు 90 శాతం అంశాలు ఒకేలా ఉంటాయి. గ్రూప్–2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్‌కు 150 మార్కుల చొప్పున 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. గ్రూప్–3లో మొత్తం మూడు పేపర్లు ఉండగా ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రిపరేషన్ లేకున్నా కచ్చితమైన గైడెన్స్, ప్లానింగ్, ప్రాక్టీస్, వ్యూహం ఉంటే నాలుగు నుంచి ఆరు నెలల ప్రిపరేషన్‌తో గ్రూప్–2, 3 ఉద్యోగం సాధించవచ్చు.
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ (పేపర్1): గ్రూప్2 అండ్ గ్రూప్3లో పేపర్1 కిందకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనే సిలబస్ కామన్‌గా ఉంటుంది. పేపర్1లో ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్. జనరల్ స్టడీస్ నుంచి 15 నుంచి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. జనరల్ ఇంగ్లిష్‌లో 70 శాతం మార్కులు సాధిస్తేనే గ్రూప్2 అండ్ గ్రూప్3 లో విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ. పేపర్ 1లో మరొక ముఖ్యమైన అంశం లాజికల్ రీజనింగ్, ఎనలటికల్ ఎబిలిటీస్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్. ఇందులో 15 నుంచి 25 ప్రశ్నలు వచ్చే చాన్స్ ఉంది. పేపర్1లో ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఇంగ్లిష్ అండ్ రీజనింగ్ మీద మంచి పట్టు ఉండాలి. ఈ రెండు సబ్జెక్టుల నుంచి దాదాపు 30 నుంచి 50 ప్రశ్నలు రావచ్చు. పేపర్1 సిలబస్ లో ఉన్న దాదాపు సగం సబ్జెక్టులు గ్రూప్3లోని పేపర్2, పేపర్3లో ఉంటాయి. అదే విధంగా గ్రూప్2లోని పేపర్2, పేపర్3లో రిపీట్ అవుతాయి. పేపర్1లో కరెంట్ ఎఫైర్స్, అంతర్జాతీయ అంశాలు చాలా ముఖ్యమైనవి. కరెంట్ ఎఫైర్స్కు సంబంధించి న్యూస్ పేపర్లు మాత్రమే చదవాలి. మ్యాగజైన్స్, మెటీరియల్స్ చదివితే అన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించలేము. సిలబస్‌లో రిపీటెడ్ టాపిక్స్: ఇండియన్ హిస్టరీ, సంస్కృతి, రాష్ట్ర పాలసీలు, తెలంగాణ సంస్కృతి, చరిత్ర సంపద, కళలు, సాహిత్యం, సోషల్ ఎక్స్‌క్లూజన్, రైట్ ఇష్యూస్, ఇన్‌క్లూజివ్ పాలసీ టాపిక్స్ గ్రూప్2, గ్రూప్3లలో పేపర్2, పేపర్3లో కవర్ అవుతుంది. పేపర్1లో పైన తెలిపిన సబ్జెక్టుల నుంచి 20 నుండి 30 మార్కులు వరకు వచ్చే చాన్స్ ఉంది. ఈ టాపిక్స్ పేపర్2, పేపర్3లో ఉంటాయి. పేపర్1లో పైన తెలిపిన సబ్జెక్టుల మీద కాకుండా మిగతా వాటి మీద ఫోకస్ చేస్తే విజయం సాధించవచ్చు.
చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం (పేపర్2): గ్రూప్2, గ్రూప్3కి పేపర్2లో ఒకే విధమైన సిలబస్ ఉంటుంది. పరీక్షలో చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం అనే మూడు సబ్జెక్టులకు సమానమైన ప్రాధాన్యతతో క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు. ఈ మూడు సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఇవ్వకపోతే అభ్యర్థుల ఫలితాలు తారుమారు అవుతాయి. రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ సబ్జెక్టుల నుంచి డైరెక్ట్ ప్రశ్నలు ఇవ్వడం లేదు. విశ్లేషణాత్మకంగా ప్రశ్నలు అడుగుతున్నారు. రాజకీయ వ్యవస్థ మీద ప్రామాణికమైన పుస్తకాలను ఒకటి కంటే ఎక్కువ చదవాలి. ప్రైవేట్ పుస్తకాల్లో పదాలు సింపుల్‌గా అర్థమవుతాయి. పాత ప్రశ్నలు కవర్ చేస్తారు, కాని రాబోయే ప్రశ్నల విశ్లేషణ కాని, క్లూ కాని ఎక్కడ కనిపించదు. అందుకనే ప్రైవేట్ రచయితలు రాసిన పుస్తకాలు చదివిన వారు పరీక్షలో విఫలమవుతున్నారు.
ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి (పేపర్3): ఈ పేపర్‌కు సంబంధించి గ్రూప్2, గ్రూప్3లో సిలబస్ ఒకేవిధంగా ఉంటుంది. ఇందులో మూడు సబ్జెక్టులు ఉన్నా సమానమైన ప్రశ్నలు పరీక్షలో రాకపోవచ్చు. సాధారణంగా ఆర్థిక వ్యవస్థ అనగానే సబ్జెక్ట్ టఫ్ గా ఉంటుందని భావిస్తారు. సిలబస్ కమిటీ సభ్యులు దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణంగా ఉండే సిలబస్ రూపొందించారు. ఎకానమీ అనగానే గుర్తుకు వచ్చేది నంబర్లు. నంబర్లు గుర్తుపెట్టుకోకుండా విశ్లేషణాత్మకంగా చదివితే మార్కులు సాధించే ఏకైక సబ్జెక్ట్ ఎకానమీ. సంఖ్యలతో ముడిపడి ఉండే మార్కులు ఎకానమీలో 150లో 10 నుంచి 20 మాత్రమే ఉంటాయి. ఈ సబ్జెక్టులో స్టాటిక్ అంశాలు పక్కన పెట్టి డైనమిక్ అంశాల మీద ఫోకస్ చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు.
తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు (పేపర్ 4): ప్రామాణికమైన పుస్తకాలు చదివితే మంచి స్కోర్ సాధించే సబ్జెక్ట్ ఇది. దీనిలో ముఖ్యంగా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, ముల్కీ ఉద్యమాలు, సాలార్జంగ్ సంస్కరణలు, 1948 నుంచి 1952 వరకు జరిగిన పరిపాలన విధానం వీటిని వివిధ పుస్తకాల నుంచి సేకరించి చదువుకోవాలి. ఈ అంశాల గురించి ఏ ఒక్క పుస్తకంలో పూర్తి సమాచారం దొరకదు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మరొక విషయం ‘కింది వాటిలో సరికానిది/ సరైంది, వరుస క్రమంలో అమర్చండి, ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చండి’ లాంటి ప్రశ్నల విధానం చాలా పెరిగింది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాయాలంటే సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు సాధించాలి. ఉద్యమ చరిత్రకు సంబంధించి తేదీలను, సంవత్సరాలను, సంఘటనలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. కొన్ని రిపోర్టులను పూర్తిగా చదవాలి. ఉదాహరణకు విభజన చట్టం, శ్రీకృష్ణకమిటీ రిపోర్ట్, రోశయ్య కమిటీ, చిన్న రాష్ట్రాల మీద అంబేద్కర్ అభిప్రాయం మొదలైనవి. ఐదు సూత్రాల పథకం, ఆరు సూత్రాల పథకం, ఎనిమిది సూత్రాల పథకం గురించి పూర్తిగా చదవాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు వాటి పర్యవసనాలు మీద అవగాహన ఉండాలి.
సిలబస్ మధ్య తేడాలు
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అనే అంశం గ్రూప్–2లో ఒక పేపర్‌గా ఉంటుంది. దీనికి 150 మార్కులు ఉంటాయి. గ్రూప్–3 లో పూర్తి పేపర్ ఉండదు. కాని తెలంగాణ ఉద్యమ చరిత్ర సిలబస్ పేపర్–2లో భాగంగా ఉంటుంది. గ్రూప్–3లో తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రాధాన్యత చాలా తక్కువ ఉంటుంది. ఉద్యమ చరిత్ర నుంచి గ్రూప్–3లో 15 మార్కుల కంటే ఎక్కువ ప్రశ్నలు రాకపోవచ్చు. గ్రూప్–2, గ్రూప్–3 ప్రిపరేషన్లో మొత్తంగా చూస్తే ఉద్యమ చరిత్ర తప్ప మిగతా సిలబస్ మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది.
గ్రూప్–3కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటుకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్క సెక్షన్ మాత్రమే ఈ సిలబస్ ఉంది. మిగతా నాలుగు సెక్షన్లు తెలంగాణ చరిత్ర, సంస్కృతి సిలబస్ ఉంది. అదే విధంగా సిలబస్ ప్రకారం అన్ని సెక్షన్లలో ఉన్న సిలబస్‌కు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఏమీ లేదు. కాబట్టి గ్రూప్–3లో తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 15 ప్రశ్నల కంటే ఎక్కువ రాకపోవచ్చు.
గ్రూప్–2లో తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఏర్పాటు ఒక పేపర్‌గా ఉంటుంది. ఇది నాలుగో పేపర్. 150 మార్కులకు ఉంటుంది. అంటే గ్రూప్–2లో తెలంగాణ ఉద్యమానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రామాణికమైన పుస్తకాలు, రెగ్యులర్‌గా ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే దాదాపు 140 మార్కుల వరకు స్కోర్ సాధించవచ్చు. 2016 గ్రూప్–2 నాలుగో పేపర్ లెక్క ప్రశ్నలు ఇవ్వడం అనే ట్రెండ్ ఇప్పుడు లేదు. మూసధోరణిలో చదివితే సక్సెస్ సాధించలేము. ప్రామాణికమైన పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ప్రైవేట్ పుస్తకాల నుంచి మాత్రం కాదు.
పృథ్వీ కుమార్ చౌహాన్
పృథ్వీస్ IAS స్టడీ సర్కిల్