- ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయంటున్న అభ్యర్థులు
- ఉమ్మడి ప్రభుత్వాలు, తెలంగాణ ఉద్యమంపై క్వశ్చన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజులుగా జరుగుతున్న గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే పరీక్షకు సగం మంది కూడా అటెండ్ కాలేదు. మొత్తం 5,51,855 మంది అభ్యర్థులకు గానూ 2,51,486 (45.57%) మంది హాజరయ్యారు. స్టేట్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఆదివారం, సోమవారం రెండు రోజులు నాలుగు పరీక్షలు జరిగాయి. స్టేట్ వైడ్గా 1,368 సెంటర్లలో పరీక్ష జరిగింది. సోమవారం పేపర్–3కి 2,51,738 (45.62%) మంది, పేపర్–4కు 2,51,486 (45.57%) మంది అటెండ్ అయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు.
గ్రూప్2 పరీక్షల్లో జీఎస్, ఎకానమీ చాలా కఠినంగా వచ్చాయనీ, సెకండ్.. ఫోర్త్ పేపర్స్ మధ్యస్థంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. క్వశ్చన్లు ఎక్కువగా టైమ్ తీసుకునేలా ఉన్నాయనీ, మల్టిపుల్ ఆన్సర్లు చేసేవిగా ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్–4లో ప్రతి అంశం కవర్ అయ్యేలా క్వశ్చన్లున్నాయని అభ్యర్థులు పేర్కొన్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమాలు, వివిధ కమిటీలు, వివిధ ఉద్యమకారులు వివిధ సంస్థల గురించి, పార్టీల గురించి క్వశ్చన్లు వచ్చాయి. కేసీఆర్, బీఆర్ఎస్, టీడీపీ పైనా ప్రశ్నలు అడిగారు.
ఉద్యమ గేయాలపై, విప్లవ సంస్థలు, కార్మిక సంస్థల ప్రస్థానం.. రైతు ఉద్యమాలు, నిజాం పాలన.. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ప్రశ్నలు వచ్చాయి. గద్దర్, విమలక్క.. గేయాలపై ప్రశ్నలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలపైనా పలు ప్రశ్నలు అడిగారు. కేసీఆర్, సోనియాగాంధీ, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీతో పాటు తెలంగాణ తల్లి విగ్రహంపైనా క్వశ్చన్లు వచ్చాయి. మూల్కీ రూల్స్, నక్సలైట్లు, జీవో 610, 36 తదితర వాటిపై కూడా ప్రశ్నలు వచ్చాయి.