వరంగల్ జిల్లాలో గ్రూప్​–2 పరీక్ష ప్రశాంతం

 వరంగల్ జిల్లాలో గ్రూప్​–2 పరీక్ష ప్రశాంతం

మహబూబాబాద్/ ములుగు/ జనగామ/కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో గ్రూప్​–2 తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ ఆధ్వర్యంలో అధికారుల సమన్వయంతో పరీక్ష సజావుగా ముగిసినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. కాగా, పరీక్ష కేంద్రాలను అడిషనల్​కలెక్టర్ వీరబ్రహ్మచారి, పరీక్షల నిర్వహణ అధికారి ఆర్సీవో డాక్టర్ బలరాం నాయక్ డీవీహెచ్వో మరియన్న సెంటర్లను పరిశీలించారు. ఉదయం పేపర్ 1కు 52 శాతం, మధ్యాహ్నం పేపర్ 2కు 51.78 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.

ములుగు జిల్లాలో 9 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2195 మందికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను ములుగు అడిషనల్​కలెక్టర్​సంపత్​రావు పరిశీలించారు. పరీక్షకు ఉదయం సెషన్​లో 1118 మంది హాజరు కాగా, 1077మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం సెషన్​లో 1115మంది హాజరు కాగా, 1080 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు.

కాగా, పరీక్షకు సమయానికి రాకపోవడంతో నలుగురు అభ్యర్థులు వెనుదిరిగినట్లు తెలిసింది. జనగామ జిల్లాలో 16 సెంటర్లను ఏర్పాటు చేయగా 5470 మంది అభ్యర్థులకు ఉదయం పేపర్​-1 కు 2959 మంది, మధ్యాహ్నం పేపర్​-2 పరీక్షకు 2947 మంది హాజరయ్యారు. సెంటర్ల వద్ద డీసీపీ రాజమహేంద్ర నాయక్​ పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. వరంగల్​జిల్లాలోని పాలెం ఇన్ఫాన్ట్​జీసస్​స్కూల్​పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్​సత్య శారదాదేవి పరిశీలించారు. 

ఒక సెంటర్​ బదులు మరో సెంటర్​కు..

జనగామ జిల్లా కేంద్రంలో కన్ఫ్యూజన్​తో ఒక సెంటర్​ కు బదులు మరో సెంటర్​కు వెళ్లిన బాలింత గ్రూప్​–2 పరీక్ష రాయలేక వెనుదిరిగింది. కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు వసరాం తండాకు చెందిన భూక్య సునీతకు జనగామ సాన్​మారియా స్కూల్​లో సెంటర్​ కేటాయించారు. ఈ స్కూల్​పక్కనే ఉన్న మరో సెంటర్​ సెయింట్​మేరీస్​స్కూల్​లోనూ పరీక్ష ఉండడంతో కన్ఫ్యూజ్ అయిన ఆమె భర్త భూక్య సునీతను సెయింట్​మెరీస్​సెంటర్ లోకి అరగంట ముందే పంపించాడు. అధికారులు సైతం ఫొటో, ఐడీలను చూసి లోనికి అనుమతించారు. పరీక్ష గదికి వెళ్లగా అక్కడున్న ఇన్విజిలేటర్ కూడా సరిగా చూడక పోవడం, హాల్​టికెట్​నంబర్​లోని చివరి నాలుగు నంబర్లు ఒకేలా ఉండడంతో సీట్లో వెళ్లి కూర్చుంది.

సదరు బెంచ్​పై కేటాయించిన హాల్​టికెట్​నంబర్​ గల అభ్యర్థి కూడా గైర్హాజరు కావడంతో ఆమెకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. తీరా ఓఎంఆర్​ షీట్​ఇచ్చిన ఇన్విజిలేటర్​ హాల్​టికెట్​నంబర్​ను చెక్​ చేయడంతో కోడ్​వేరుగా ఉండడాన్ని గుర్తించారు. సదరు కోడ్​ఉన్న సెంటర్​సాన్​మారియా అని, అక్కడికి వెళ్లాలని పరీక్ష గదినుంచి పంపించారు. దీంతో ఆందోళన చెందిన అభ్యర్థిని పక్కనే ఉన్న సాన్​మారియా సెంటర్​కు వెళ్లగా, అప్పటికే టైం అయిపోవడంతో అధికారులు సెంటర్​లోకి అనుమతించ లేదు. దీంతో అభ్యర్థి సునీత కన్నీటి పర్యంతమయ్యింది. 

తల్లికి పరీక్ష పాపను  ఆడించిన పోలీసులు..

మహబూబాబాద్ లో గ్రూప్–2 పరీక్షలో భాగంగా ఓ తల్లి తన బిడ్డతో పరీక్ష రాయడానికి వచ్చింది. మహిళకు సంబంధించిన వారు ఎవ్వరూ రాకపోవడంతో పరీక్ష రాయడం ఇబ్బంది తప్పదనుకుంది. అక్కడే ఉన్న టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ పాపను దగ్గరికి తీసుకుని ఆడించారు. దీంతో ఆ తల్లి పరీక్షను విజయవంతంగా రాసింది. పాపను ఎత్తుకుని సీఐ ఆడించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.