ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్ష

ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్ష

వెలుగు, నెట్​వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం మొదటి రోజు గ్రూప్–2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. హాల్​ టికెట్లు, అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరం సెంటర్లలోకి అనుమతించారు. ఒక నిమిషం నిబంధన కారణంగా పలువురు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంటర్లను కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. 

వనపర్తి జిల్లాలో 8,569 మంది అభ్యర్థులకు గాను.. పేపర్–1కు 4,408 మంది హాజరవగా, పేపర్–2కు 4,381 మంది హాజరయ్యారు. వనపర్తిలోని పలు కేంద్రాల్లో ఒక్క నిమిషం నిబంధన కారణంగా 10 మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరిగారు. నారాయణపేట జిల్లాలో 3,994 మందికి గాను.. పేపర్–1కు 2,052 మంది, పేపర్–2కు 2,046 మంది హాజరయ్యారు. నాగర్​కర్నూల్​ జిల్లాలోని 32 పరీక్ష కేంద్రాల్లో 9,731 మంది అభ్యర్థులకు గాను.. పేపర్–1కు 4,772 మంది, పేపర్–2కు 4,755 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

జిల్లాలో నిమిషం నిబంధన కారణంగా 19 మంది అభ్యర్థులను అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. మహబూబ్​నగర్​ జిల్లాలో 54 సెంటర్లను ఏర్పాటు చేశారు. 20,584 క్యాండిడేట్లకు గాను.. పేపర్–1కు 10,380, పేపర్–2కు 10,314 మంది అటెండ్​ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 8,722 మంది అభ్యర్థులకు గాను.. పేపర్-1కు 49.28 శాతం, పేపర్-2కు 49.04 శాతం అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.