తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. పరీక్షలు వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-2, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఒకేరోజు ఉన్నందున వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అభ్యర్థులు. డిసెంబర్ 9న విచారణ సందర్భంగా .. ఎగ్జామ్స్ కు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున .. వాయిదా వేయలేమని తెలిపింది హైకోర్టు.
డిసెంబర్ 15, 16న గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. 2 రోజులు నాలుగు సెషన్లలో గ్రూప్–2 పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని టీజీపీఎస్సీ అభ్యర్థులకు కీలక సూచన చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.
పరీక్షా కేంద్రానికి ఎలక్ట్రానిక్స్ పరికరాలు తేవద్దని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. హాల్ టికెట్ డౌన్ లోడ్ సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే సంబంధింత అధికారులను సంప్రదించాలని పేర్కొంది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. కాగా, 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.