ఆదిలాబాద్​జిల్లాలో గ్రూప్–3 ఫస్ట్ డే ప్రశాంతం..భారీగా గైర్హాజరు 

ఆదిలాబాద్​జిల్లాలో గ్రూప్–3  ఫస్ట్ డే ప్రశాంతం..భారీగా గైర్హాజరు 
  • పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్లు

నెట్​వర్క్, వెలుగు: గ్రూప్–3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అయితే హాజరు శాతం భారీగా తగ్గింది. ఆదిలాబాద్​జిల్లాలోని 29 పరీక్ష కేంద్రాల్లో 10, 255 అభ్యర్థులకు గాను  6,612అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాశారు. 3,643 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్​2కు 3674 మంది గైర్హాజరయ్యారు. 64.17 శాతం హాజరు నమోదైంది. కలెక్టర్​ రాజర్షి షా పలు కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపాలని సూచించారు. నలంద కాలేజీ పరీక్షా కేంద్రంలో ఉదయం పలువురు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో పరీక్షకు దూరమయ్యారు.

కలెక్టర్ ను వారు వేడుకున్నప్పటికీ అనుమతి ఇవ్వలేదు. నిబందనలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లాలోని 48 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 15,038 మందికి గానూ 8,246 మంది అభ్యర్థులు హాజరయ్యారు.  జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను కలెక్టర్​ కుమార్ ​దీపక్, అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్ డీసీపీ భాస్కర్ పరిశీలించారు. నిర్మల్ జిల్లాలో 8,124 మంది అభ్యర్థులకు గాను 4,710 మంది పరీక్ష రాశారు.

3,414 మంది గైరాజరయ్యారు. కలెక్టర్ అభిలాష అభినవ్ పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఎస్పీ జానకి షర్మిల బందోబస్తు చర్యలపై ఆరా తీశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 18 సెంటర్లలో 4,471మంది అభ్యర్థులకు గాను ఫస్ట్ పేపర్ లో 2794 మంది హాజరు కాగా 1677 మంది గైర్హాజరయ్యారు. పలు సెంటర్లను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. కాగజ్​నగర్​లోని 9 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా సాగింది. సోమవారం 3వ పేపర్​ ఎగ్జామ్​ జరగనుంది.