- పేపర్-1కు 51.1%.. పేపర్-2కు 50.7% హాజరు
- తొలిరోజు రెండు పేపర్లు రాసింది సగం మందే
- తెలంగాణ స్కీమ్స్, స్కిల్ యూనివర్సిటీపై క్వశ్చన్స్
- నేడు ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-3
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో గ్రూప్ –3 ఎగ్జామ్స్ షురూ అయ్యాయి. తొలిరోజు ఆదివారం పేపర్– 1, పేపర్– 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 1,401 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-–1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–-2 పరీక్ష జరిగింది. మొత్తం 5,36,400 మందికి గానూ పేపర్ –1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ కు 2,73,847 (51.1%) మంది, పేపర్– 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ కి 2,72,173 (50.7%) మంది హాజరయ్యారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసినవారిలో 76.4 శాతం మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా, దరఖాస్తు చేసిన వారిలో సగం మంది మాత్రమే అటెండ్ అయ్యారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 64.2 శాతం మంది హాజరు కాగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 41శాతం మంది పరీక్షలు రాశారు. అయితే, నిర్ణీత టైమ్‌కు గంటర్నర ముందే అధికారులు.. అభ్యర్థులను పరీక్షా హాల్స్ లోకి అనుమతించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షకు 8.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి పంపించారు.
ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులతో సందడి నెలకొన్నది. పరీక్షా సమయానికి అరగంట ముందే గేట్లు క్లోజ్ చేశారు. దీంతో పలువురు అభ్యర్థులు ఆలస్యంగా సెంటర్లకు చేరుకోగా, వారిని లోనికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించగా, అభ్యర్థులను పూర్తిస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే అక్కడి సిబ్బంది సెంటర్లోకి పంపించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్ –3 ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ స్కీమ్స్‌పై ప్రశ్నలు
గ్రూప్– 3 పేపర్–1లో తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న స్కీమ్స్‌పై ప్రశ్నలు అడిగారు. మహాలక్ష్మి స్కీమ్ప్రయోజనాలేమిటి? అనే కొశ్చన్ వచ్చింది. అలాగే, హరితహారం, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, మహాలక్ష్మి స్కీమ్స్ లక్ష్యం/ఉద్దేశ్యాలపై ప్రశ్నలు అడిగారు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్, కో చైర్మన్ల పేర్లపైనా ఓ కొశ్చన్ వచ్చింది. జూన్ లో పీఎం– కిసాన్ సమ్మాన్ నిధి ఎన్నో విడత రిలీజ్ చేశారనే ప్రశ్న అడిగారు.
తల్లి పరీక్షకు.. బిడ్డను లాలించిన పోలీస్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఓ ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఓ తల్లి తన చంటిబిడ్డతో వచ్చింది. ఎగ్జామ్‌హాల్‌లోకి బాబును అనుమతించేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఏఎస్ఐ సలీం ఆమెకు అండగా నిలిచారు. ఆమె భర్త సెంటర్వద్దకు చేరుకునే వరకూ ఏఎస్ఐ ఆ చిన్నారిని ఎత్తుకుని లాలించారు.